జగిత్యాల, అక్టోబర్ 26 (ధనాధన్ న్యూస్): ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో విద్యా వ్యవస్థను కేంద్రీకృతం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. గతంలో కొనసాగుతున్న రెసిడెన్షియల్ పాఠశాలలను యథావిధిగా కొనసాగిస్తూ, అవసరమైన అదనపు భవనాలు నిర్మించాలని సూచించారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో దావా సురేష్, పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు.రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో విద్య, వైద్యం ప్రతి వర్గానికి అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చారని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 261 రెసిడెన్షియల్ పాఠశాలలు మాత్రమే ఉండగా, కేసీఆర్ ప్రభుత్వం అదనంగా 652 గురుకుల పాఠశాలలను మంజూరు చేసిందన్నారు.


బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు 19 ఉండగా అదనంగా 262 ఏర్పాటు చేశామని, మైనారిటీ గురుకులాలు 12 ఉండగా 194కు పెంచామని, ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు 134 ఉండగా అదనంగా మరో 134 మంజూరు చేశామని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలను ఇంటర్మీడియట్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేశామని, ఒక్కో రెసిడెన్షియల్ పాఠశాలలో సుమారు 640 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఏటా 20,880 మంది విద్యార్థులకు మాత్రమే రెసిడెన్షియల్ విద్య అందుతుండగా, కేసీఆర్ పాలనలో ఏటా 52,160 మంది విద్యార్థులు విద్యను అభ్యసించే అవకాశం కల్పించామని జీవన్‌రెడ్డి వివరించారు. మొత్తం విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు.అయితే ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్ల పాలనలో ఒక్క కొత్త రెసిడెన్షియల్ పాఠశాలను కూడా ప్రారంభించలేదని, అదనంగా ఒక్క విద్యార్థికి కూడా సీటు కల్పించలేదని ఆయన విమర్శించారు. గతంలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలకు అవసరమైన అదనపు భవనాలు నిర్మించకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో కొత్త భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టడం వల్ల విద్యార్థులకు ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.


రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలి


రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో రిజర్వేషన్ల ప్రకారం వివిధ కులాలు, వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని జీవన్‌రెడ్డి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పేరుతో రిజర్వేషన్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందా అని ప్రశ్నించారు. కొత్త పాఠశాలల్లో అడ్మిషన్ ప్రక్రియ, రిజర్వేషన్లు, విద్యా బోధన విధానంపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు.సింగరావుపేట, లక్ష్మీపూర్ ప్రాంతాల్లో కొనసాగుతున్న రెసిడెన్షియల్ పాఠశాలలకు అవసరమైన భవనాలు నిర్మించాలని, గతంలో ఉన్న పాఠశాలలను కొనసాగిస్తూనే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేసి కొత్తగా అడ్మిషన్లు కల్పించాలని సూచించారు. ప్రతి మండలానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసి కొత్త అడ్మిషన్లు తీసుకోవాలని అన్నారు.రెసిడెన్షియల్ పాఠశాలలు ఆయా ప్రాంతాల్లో కొనసాగితే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూడా దోహదపడతాయని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.


వెయ్యి పాఠశాలలు మూతపడ్డాయంటూ ఆరోపణ
విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి నివాస ప్రాంతానికి అందుబాటులో పాఠశాల ఉండాల్సి ఉండగా, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో సుమారు వెయ్యి పాఠశాలలు మూతపడ్డాయని జీవన్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం సుమారు ఐదు శాతం తగ్గుతోందని, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తే విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందని ప్రశ్నించారు.ప్రభుత్వం చేపట్టిన ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల గాంధీనగర్‌లోని పాఠశాలకు ప్రత్యేక అభివృద్ధి పథకం కింద రూ.30 లక్షలు మంజూరైనప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ పనులు కొనసాగించడం లేదని తెలిపారు.


చల్గల్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రతిపాదనపై ప్రశ్నలు
జగిత్యాల జిల్లా కలెక్టర్ చల్గల్ వ్యవసాయ ప్రదర్శన క్షేత్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదన చేశారని, అందుకు అనువైన స్థలాన్ని కూడా గుర్తించారని జీవన్‌రెడ్డి తెలిపారు. అయితే ప్రతిపాదిత 20 ఎకరాల భూమిని కేటాయించకపోవడంపై ప్రశ్నించారు.జీవో 571 ప్రకారం భూమి కేటాయించే అవకాశం ఉందని కలెక్టర్ చెబుతున్న నేపథ్యంలో చల్గల్‌లో మరో పది ఎకరాల భూమిని కేటాయించే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, తాటిపల్లి గుట్టల్లో వేలాది చెట్లను నరికివేసి గుట్టలను ధ్వంసం చేయడం సరికాదన్నారు.ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కేటాయించిన రూ.200 కోట్లలో కొంత మొత్తాన్ని భూమి కొనుగోలుకు వెచ్చించి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. గుట్టలను ధ్వంసం చేసి పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదన చేశారా అనే విషయంపై కలెక్టర్ స్పష్టత ఇవ్వాలని కోరారు.


తెలంగాణ ఉద్యమ సమయంలోనే రాష్ట్రంలో విద్య, వైద్యం, సాగునీరు, విద్యుత్ రంగాలను అభివృద్ధి చేయాలని కేసీఆర్ ఆలోచించారని జీవన్‌రెడ్డి అన్నారు. ప్రతి జిల్లా కేంద్రానికి వైద్య కళాశాల, నియోజకవర్గ కేంద్రాల్లో గురుకుల పాఠశాలలు, సాగునీటి కోసం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని పేర్కొన్నారు.
కేసీఆర్ పాలనలో మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టగా, ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్లలో కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేకపోయిందని విమర్శించారు. ప్రాణహిత జలాలను వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు.కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద తాత్కాలిక కాఫర్ డ్యామ్ నిర్మించి నీటిని ఎత్తిపోయాలని, సీతారామ ప్రాజెక్టు వద్ద ఇసుక సంచులతో నీటిని నిల్వ చేసే చర్యలు చేపట్టాలని సూచించారు. ఆరు నెలలుగా నీటిని వృథాగా వదిలిపెట్టారని, ఇకనైనా నీటిని సద్వినియోగం చేసి రాష్ట్రాన్ని కరువు నుంచి రక్షించాలని కోరారు.సుమారు రూ.100 కోట్లతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.


ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని జీవన్‌రెడ్డి అన్నారు. ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు ఇప్పటివరకు రెండో విడత దుస్తులు అందలేదని పేర్కొన్నారు.గతంలో రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లోనే ఐదు ఎకరాల భూమిని సేకరించి అదనపు భవనాలు నిర్మించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని, అమ్మ ఆదర్శ పాఠశాలల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారని, దాన్ని ఉపయోగించుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జీవన్‌రెడ్డి అన్నారు.ఈ సమావేశంలో అయిల్నేని వెంకటేశ్వరరావు, ఆనంద్‌రావు, ఆవారి శివకేసరి బాబు, దేవేందర్ నాయక్, కోరుకంటి రాము, శీలం ప్రవీణ్‌కుమార్, గంగారెడ్డి, అయిల్నేని ఆనంద్‌రావు, కళ్లపల్లి దుర్గయ్య, మున్నా, పుప్పాల అశోక్, రజనీకాంత్, జున్ను రాజేందర్, పొట్టవత్తిని సతీష్, పల్లె రవి, బాలె రవి, ధరా రమేష్‌బాబు, చందా రాధాకిషన్, బారి, నక్క జీవన్, శీలం సురేందర్, శ్రీరామ్ గంగాధర్, మామిడిపల్లి మహిపాల్, వెంకట్‌రెడ్డి, కట్కూరి రాజేందర్, చింతకింది నరేష్, అసిఫ్, గాజుల శ్రీనివాస్, ధర్మయ్య, గుండ మధు, అభి, ముద్దం రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply