అదనపు కట్నం కోసం వేధింపులు.. నలుగురిపై కేసు నమోదు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 10: అదనపు కట్నం తీసుకురావాలని కోడలిని వేధించిన భర్తతో పాటు అత్తమామలు, బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మడిపల్లి గ్రామానికి చెందిన ఇగ్గేటి అనూష (26)కు గత ఏడాది ఉల్లంపల్లి గ్రామానికి చెందిన బుల్లి అజయ్‌కుమార్‌తో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వివాహ సమయంలో వధువు కుటుంబ సభ్యులు ఎకరం భూమి, రూ.8 లక్షల నగదు, ఇతర లాంఛనాలతో ఘనంగా పెళ్లి జరిపించినట్లు తెలిపారు.

పెళ్లి అనంతరం కొంతకాలం దాంపత్య జీవితం సాఫీగా సాగినప్పటికీ, తర్వాత భర్త అజయ్‌కుమార్ మద్యం సేవిస్తూ భార్యను వేధించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని అత్త బుల్లి రామ, మామ కొమురయ్య, బావ రంజిత్, ఆడపడుచు మమతలకు చెప్పినా వారు భర్తకు మద్దతుగా నిలిచి, అదనంగా రూ.5 లక్షలు తీసుకురావాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు.

డబ్బులు తీసుకురాకపోతే ఇంట్లో ఉండనివ్వమని, శారీరకంగా మరియు మానసికంగా వేధించి ఇంటి నుంచి వెళ్లగొట్టినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 22న పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాలేదని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a comment