- రాయపల్లి సర్పంచ్ సహా ఇద్దరిపై రేగొండ పోలీస్ స్టేషన్‌లో కేసు

భూపాలపల్లి,జూన్ 7 (ధనాధన్ న్యూస్):
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి చెందిన జర్నలిస్టు ఇప్పకాయల సాగర్‌ను దూషించి, ప్రాణహాని కలిగిస్తామని బెదిరించిన ఘటనలో రాయపల్లి గ్రామ సర్పంచ్ తాడం తిరుపతి, అంకం రాజేందర్‌లపై రేగొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళ్తే, రాయపల్లి గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూముల నుంచి అక్రమంగా మట్టి తరలింపుపై జర్నలిస్టు ఇప్పకాయల సాగర్ వార్త ప్రచురించారు. దీంతో ఆగ్రహించిన సదరు వ్యక్తులు ఫోన్ ద్వారా దూషిస్తూ, చంపుతామని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు సాగర్ జర్నలిస్టు సంఘాల నాయకులతో కలిసి రేగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం తాడం తిరుపతి, అంకం రాజేందర్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జర్నలిస్టుపై జరిగిన బెదిరింపుల ఘటనను తీవ్రంగా పరిగణించిన వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు పోలీసులను కలిసి న్యాయం చేయాలని కోరారు. కేసు నమోదు చేయడంపై వారు పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు ఈసంపల్లి వేణు, జాతీయ ఉపాధ్యక్షుడు చొల్లేటి బ్రహ్మచారి, అఖిల భారతీయ జర్నలిస్టు ప్రొడక్షన్ ఫోర్స్ రాష్ట్ర చైర్మన్ చుంచు కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు పర్కాల సమ్మయ్య గౌడ్‌లు సంయుక్తంగా మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.

జిల్లాలో కొందరు వ్యాపారవేత్తలు విలేకరులను బెదిరిస్తున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే జర్నలిస్టుల ఫోటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన ఓ యూట్యూబర్‌పై, అసత్య ప్రచారాలు చేస్తున్న మరికొందరిపై కూడా న్యాయపరమైన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో ఎక్కడైనా జర్నలిస్టులకు అన్యాయం జరిగినా తమ సంఘాలు అండగా నిలుస్తాయని, బెదిరింపులకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని, అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చే విలేకరులను బెదిరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.జర్నలిస్టుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు. కేసు నమోదు చేసి చర్యలు ప్రారంభించిన రేగొండ పోలీసుల తీరును జర్నలిస్టు సంఘాల నాయకులు స్వాగతించారు.