- ఖాళీ సిలిండర్లతో కాంగ్రెస్ నిరసన.. మోదీ సర్కార్‌పై మండిపాటు
- పేదలపై ధరల భారం మోపొద్దు: ఇందిరా చౌక్‌లో కాంగ్రెస్ ఆందోళన

కరీంనగర్/ధనాధన్ న్యూస్ జూన్ 8: కేంద్రంలోని ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ఎల్‌పీజీ గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ నగరంలోని ఇందిరా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లు, బీజేపీ వ్యతిరేక నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ కట్టెల పొయ్యిపై వంట చేస్తూ కాంగ్రెస్ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఎల్‌పీజీ గ్యాస్ ధరలను సైతం పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం మోపుతోందని విమర్శించారు. ఇటీవల ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్‌పై రూ.29 పెంపు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.
ఎన్నికల అనంతరం ధరల భారం పెరుగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందుగానే హెచ్చరించారని, ప్రస్తుతం అదే జరుగుతోందని పేర్కొన్నారు. ఇంధన ధరల పెంపు ప్రభావం నిత్యావసర వస్తువులపై పడడంతో సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఒకవైపు ‘వికసిత భారత్’, ‘విశ్వగురు’ అంటూ ప్రచారం చేసుకుంటూనే మరోవైపు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. గ్యాస్ ధరలు తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై స్పందించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర బీజేపీ నేతలు మౌనం పాటించడం బాధాకరమన్నారు. ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, లేకుంటే ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.
కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ 2014లో రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1200కు చేరుకుందని అన్నారు. సబ్సిడీని ఎత్తివేసి ఉజ్వల పథకాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. గ్యాస్ నింపించుకునే స్థోమత లేక పలువురు మహిళలు మళ్లీ కట్టెల పొయ్యిలను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడిందన్నారు.కార్యక్రమం అనంతరం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఉప్పుల అంజనీ ప్రసాద్, మల్లికార్జున రాజేందర్, పులి ఆంజనేయులు గౌడ్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఆకుల నరసయ్య, మడుపు మోహన్, పర్వతం మల్లేశం, గంట శ్రీనివాస్ కళ్యాణి, పడాల అజయ్ గౌడ్, భాస్కర్ నాయక్, వెన్నం రజిత రెడ్డి, మామిడి సత్యనారాయణ రెడ్డి, అబ్దుల్ రహమాన్, అమీర్, భగవాన్ దాస్ తదితర నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.