వీణవంక మండలంలో కాంగ్రెస్ ప్రచార జోరు!

By dhanadhannews.com

  • అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ప్రచారం
  • గ్రామస్థుల నుండి ఘన స్వాగతం అందుకున్న కాంగ్రెస్ నాయకులు
  • మేము చేసింది చెబుతున్నాం,కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి – వొడితల ప్రణవ్ బాబు

వీణవంక/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో వీణవంక మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం దూసుకుపోతోంది. శనివారం రోజున బేతిగల్, కనపర్తి, వల్భాపూర్, నర్సింగాపూర్, కిష్టం పేట, గంగారం, చల్లురు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, మంగళహారతులు, బాణాసంచా కాల్పులతో కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించారు.


ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, గ్రామాల్లోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందజేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ప్రధానంగా, పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. “అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధికి నిధులు వరదలా వస్తాయి. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సెంటిమెంట్ రాజకీయాలతో ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకేం చేయడం లేదు,” అని ఆయన విమర్శించారు.


గతంలో ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి ఉన్నప్పుడు నర్సింగపూర్-వీణవంక రోడ్డు పనులను ఎందుకు పూర్తి చేయలేదని వొడితల ప్రణవ్ ప్రశ్నించారు. “కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నాం. దీనిబట్టి పని చేసే వారు ఎవరో, మాయమాటలు చెప్పే వారెవరో ప్రజలకు అర్థం అవుతుందని” అన్నారు.
ఓడినా, గెలిచినా ప్రజల పట్ల నిబద్ధతతో ఉంటామని పేర్కొంటూ, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి, ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని ఆయన గ్రామస్థులను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో వీణవంక మండల నాయకులు, మార్కెట్ డైరెక్టర్లు, ఆయా గ్రామశాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.