- రూ.89.10 లక్షల విలువైన ఆర్థిక సాయం అందజేత

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 9: కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మంగళవారం మల్లాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి చెందిన 89 మంది లబ్ధిదారులకు రూ.89,10,324 విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఈ పథకాల ద్వారా లక్షలాది పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించిందని, ఆడబిడ్డల వివాహాల విషయంలో కేసీఆర్ ఎల్లప్పుడూ అండగా నిలిచారని పేర్కొన్నారు.సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక వినూత్న పథకాలను అమలు చేశారని, పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిరంతరం కృషి చేశారని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అమలు చేసిన పథకాలు తెలంగాణ అభివృద్ధికి బాటలు వేసాయని అన్నారు.

రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి అండగా నిలిచిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కేసీఆర్ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని ఎమ్మెల్యే సంజయ్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.