కమలాపూర్,ఆగస్టు 10: కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజకీయ విమర్శలు, వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తున్న సమయంలో ఎమ్మెల్యే స్పందిస్తూ, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “అబద్ధాలు చెప్పొద్దు.. నిజాలు మాట్లాడాలి. ఇది రాజకీయాలు చేయాల్సిన వేదిక కాదు. ప్రజలకు వాస్తవాలు చెప్పండి. అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు” అని స్పష్టం చేశారు.కేసీఆర్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమంలో రాజకీయ విమర్శలు చేయడం కంటే, ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.


డబుల్ బెడ్‌రూమ్ కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలి
కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభించడానికి వచ్చిన మంత్రులు కేవలం ప్రారంభోత్సవం చేసి వెళ్లకుండా, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
డబుల్ బెడ్‌రూమ్ కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్, రోడ్ల వంటి మౌలిక వసతుల సమస్యలు ఉన్నాయని తెలిపారు. ప్రజలకు అవసరమైన కనీస సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.ఇంకా కొన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తికాకుండా మిగిలిపోయాయని, వాటికి అవసరమైన నిధులు కేటాయించి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. చిన్నచిన్న నిర్మాణ పనులు, ఇతర మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కూడా ఆర్థిక సహాయం అందించాలని కోరారు.ఇప్పటికే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పొందిన లబ్ధిదారులు ఇళ్లలో అవసరమైన చిన్నచిన్న పనులు పూర్తి చేసుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఎమ్మెల్యే ఇదే వేదిక నుంచి మంత్రులను కోరారు.


కాంగ్రెస్ హామీలు అమలు చేయాలి
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, ఆడపిల్లల వివాహాలకు కళ్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం, పెన్షన్ల పెంపు వంటి హామీల అమలుపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.


ఉప్పల్, చల్లూరును ప్రత్యేక మండలాలుగా ఏర్పాటు చేయాలి
కమలాపూర్ మండలంలోని ఉప్పల్, వీణవంక మండలంలోని చల్లూరును ప్రత్యేక మండలాలుగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఉప్పల్ ప్రాంతంలో దాదాపు 8 వేల మంది జనాభా ఉందని, మండలంగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు.


కమలాపూర్ బస్‌స్టాండ్‌కు రూ.2 కోట్లు కేటాయించాలి
కమలాపూర్ బస్‌స్టాండ్ నిర్మాణం కూడా పూర్తికాకుండా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కమలాపూర్ బస్‌స్టాండ్ నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.2 కోట్లు కేటాయించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

“పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. కమలాపూర్ బస్‌స్టాండ్‌కు రూ.2 కోట్లు కేటాయించి నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ఇది కమలాపూర్ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇదే వేదిక నుంచి మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నాను” అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
కేవలం ప్రారంభోత్సవాలు, రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా కమలాపూర్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.హుజూరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అవసరమైన ప్రతి సమస్యపై పోరాడుతామని, ప్రజల గొంతుకగా నిలుస్తామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply