సైదాపూర్, అక్టోబర్ 18: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలను ఆడపడుచులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తీరక్క, గునుగు, చామంతి, బంతి తదితర రకరకాల పుష్పాలతో బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో అందంగా అలంకరించారు.
అనంతరం తమ ఇళ్లలో పసుపుతో గౌరమ్మను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపంగా భావించే గౌరమ్మను పూజిస్తూ, ఆమె ఆశీస్సులు, దీవెనలు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఆడపడుచులు సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.


పూజల అనంతరం మహిళలు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడి, ఆటలు ఆడి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బతుకమ్మలను గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా “పోయిరా గౌరమ్మ.. పోయిరావమ్మా.. మళ్లీ వచ్చే సంవత్సరం తిరిగి రావమ్మా గౌరమ్మ” అంటూ గౌరమ్మను వేడుకున్నారు. పండుగ వేడుకలతో గ్రామంలో సందడి నెలకొంది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రాల స్వతంత్ర, ఉప సర్పంచ్ పొడిశెట్టి స్వాతి, వార్డు సభ్యులు మామిడి సురేష్, తోట వేణు, బత్తిని శ్రీలత, జెల్ల నాగరాజు, తాడవేణి బాలకృష్ణ, కొల్ల రాజిరెడ్డి, గుర్రాల లక్ష్మారెడ్డి, బొజ్జ రేణుక, గుడికందుల కల్పనతో పాటు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply