- ఆకునూరులో కప్పతల్లి ఊరేగింపు, ప్రత్యేక పూజలు
- మంచి వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు

సైదాపూర్,జూలై 17 (ధనాధన్ డిజిటల్ న్యూస్): సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో శుక్రవారం సంప్రదాయబద్ధంగా కప్పతల్లి ఊరేగింపు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుర్రాల స్వతంత్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సంప్రదాయం ప్రకారం రోకలి బండకు కప్పను వస్త్రంతో కట్టి గ్రామంలోని ప్రతి వీధి, ప్రతి గడపకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. “కప్పతల్లి… కప్పతల్లి… కడవడే నీళ్లు” అంటూ సంప్రదాయ పాటలు పాడుతూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా గ్రామస్తులు బిందెలతో నీటిని చల్లి వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోవాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గుర్రాల స్వతంత్ర మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికే నాట్లు వేసిన వరి పొలాలు, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు నీటి కొరత ఏర్పడిందని, రైతుల కష్టాలు తొలగాలంటే సమృద్ధిగా వర్షాలు కురవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.అనంతరం గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివలింగానికి జలాభిషేకం నిర్వహించారు. అలాగే ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, ఆంజనేయస్వామి, నాగులమ్మతో పాటు గ్రామదేవతలందరికీ ప్రత్యేక జలాభిషేకాలు చేసి, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
కార్యక్రమం ముగిసిన అనంతరం గ్రామంలోని మత్తడిబండ వద్ద వరుణ పాయసం నైవేద్యంగా సమర్పించి, అనంతరం గ్రామ ప్రజలకు ప్రసాదంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
