అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి అండగా జీవన్ రెడ్డి

  • గంగాధర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
  • రూ.10 లక్షల సాయం,ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి: జీవన్ రెడ్డి

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 13: జగిత్యాల పట్టణంలోని 40వ వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయిన రాచర్ల గంగాధర్ నివాసాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ తాటిపర్తి జీవన్ రెడ్డి శనివారం సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆర్థిక సహాయం అందజేశారు.అగ్నిప్రమాదం నేపథ్యంలో సంబంధిత అధికారులతో జీవన్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు. గంగాధర్ స్వయం ఉపాధితో జీవనం సాగించే నిరుపేద కుటుంబానికి చెందినవారని, కుట్టుమిషన్ల మరమ్మతులు చేయడం, దుస్తులు కుట్టడం ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటున్నారని తెలిపారు.


ఈ అగ్నిప్రమాదంలో సుమారు 60 కుట్టుమిషన్లు పూర్తిగా దగ్ధమయ్యాయని, ఇల్లు కూడా పూర్తిగా కాలిపోవడంతో కుటుంబం నివసించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అధికారుల సమాచారం ప్రకారం రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు వెల్లడించారు.బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజీవ్ యువ వికాస్ పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అలాగే నివాసం పూర్తిగా దెబ్బతిన్నందున ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Leave a comment