తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి భూమి రిజిస్ట్రేషన్

  • నకిలీ పత్రాల వ్యవహారంలో నలుగురు అరెస్ట్
  • ఇద్దరు పరారీలో ,కంప్యూటర్ పరికరాలు,నకిలీ స్టాంపుల స్వాధీనం

మెట్‌పల్లి/ధనాధన్ న్యూస్,జూన్ 14: జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మెట్‌పల్లి పోలీసులు ఆదివారం వివరాలు వెల్లడించారు.పోలీసుల కథనం ప్రకారం, మెట్‌పల్లి పట్టణంలోని ఆరపేట వార్డు శివారులో ఉన్న సర్వే నంబర్ 191 భూమికి సంబంధించి నిందితులు నకిలీ ఆబాది సర్టిఫికేట్ రూపొందించారు. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ ముద్రలను ఉపయోగించి తప్పుడు పత్రాలు సృష్టించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఆ నకిలీ పత్రాల ఆధారంగా భూమి రిజిస్ట్రేషన్ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు.


ఈ కేసులో రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేష్, పాకాల రాకేష్‌లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి కంప్యూటర్ పరికరాలు, రబ్బరు స్టాంపులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.కాగా, ఈ వ్యవహారంలో బెజ్జారపు మధుసూదన్, అంగారి శంకర్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ పత్రాలను ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a comment