
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తెలంగాణ జన సమితి (TJS) పార్టీ 4వ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి పిలుపునిచ్చారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలో ప్లీనరీకి సంబంధించిన వాల్ పోస్టర్‌ను టీజేఎస్ పార్టీ జమ్మికుంట మండల అధ్యక్షుడు పల్లెర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆమె ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అరికిల్ల స్రవంతి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో నిత్యం పోరాడుతున్న ఏకైక పార్టీ తెలంగాణ జన సమితి అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ రథసారధి,ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి ప్రజల పక్షాన నిలుస్తోందని ఆమె గుర్తు చేశారు.

ధన ప్రవాహంతో సంబంధం లేని నైతిక రాజకీయాల కోసం టీజేఎస్ కృషి చేస్తోందని స్రవంతి పేర్కొన్నారు. “కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్ వంటి మహనీయులు ఆశించిన తెలంగాణ పునర్నిర్మాణమే మా లక్ష్యం. ఆ దిశగా అడుగులు వేస్తూ, పారదర్శకమైన పాలన కోసం ప్రజలను చైతన్యపరుస్తున్నాం” అని ఆమె తెలిపారు.ఈ నెల 12వ తేదీన, హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన 4వ రాష్ట్ర ప్లీనరీ సమావేశానికి జమ్మికుంట మండలం నుంచి కార్యకర్తలు,నాయకులు మరియు మేధావులు అధిక సంఖ్యలో తరలిరావాలని జమ్మికుంట మండల అధ్యక్షుడు పల్లెర్ల శ్రీనివాస్ కోరారు. ఈ ప్లీనరీ ద్వారా పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్లు శ్రీనివాస్ తెలిపారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అరికిల్ల భానుచందర్, పార్టీ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.