
హుజురాబాద్/ధనాధన్ న్యూస్ మే 02: తెలంగాణ జన సమితి (TJS) పార్టీ 4వ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు పిలుపునిచ్చారు. శనివారం హుజురాబాద్ పట్టణంలో ప్లీనరీకి సంబంధించిన వాల్ పోస్టర్‌ను పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ముక్కెర రాజు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో నిత్యం పోరాడుతున్న ఏకైక పార్టీ తెలంగాణ జన సమితి అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ రథసారధి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి ప్రజాపక్షాన నిలుస్తోందని ఆయన గుర్తు చేశారు.

ధన ప్రవాహంతో సంబంధం లేని నైతిక రాజకీయాల కోసం టీజేఎస్ కృషి చేస్తోందని ముక్కెర రాజు పేర్కొన్నారు. “కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్ వంటి మహనీయులు ఆశించిన తెలంగాణ పునర్నిర్మాణమే మా లక్ష్యం. ఆ దిశగా అడుగులు వేస్తూ, పారదర్శకమైన పాలన కోసం ప్రజలను చైతన్యపరుస్తున్నాం” అని ఆయన వివరించారు.ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ లోని జలవిహార్ నిర్వహించ తలపెట్టిన 4వ రాష్ట్ర ప్లీనరీ సమావేశానికి కరీంనగర్ జిల్లా నుంచి కార్యకర్తలు, నాయకులు మరియు మేధావులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు. ఈ ప్లీనరీ ద్వారా పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలిపారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మోరె గణేష్, జిల్లా ఉపాధ్యక్షుడు కర్రె సతీష్ యాదవ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అరికిల్ల భానుచందర్, నాయకులు సాయి మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.