
ములుగు/ధనాధన్ న్యూస్: తెలంగాణలో ఆడబిడ్డలు, పేదలు, నిరుద్యోగుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ములుగులో నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సమ్మక్క–సారక్క ఆశీర్వాదంతో ములుగు నుంచే పాదయాత్ర ప్రారంభించామని సీఎం గుర్తుచేశారు. రాష్ట్రంలోని నలుమూలల గూడేలు, పల్లెల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి భరోసా ఇచ్చామని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు.మంత్రి సీతక్కను ఆడబిడ్డగా భావించి, ఆమె ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మేడారం సమ్మక్క–సారక్క ప్రాంగణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామని తెలిపారు. ములుగు ప్రాంతంలోని మల్లూరు నరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని, జంపన్న వాగును నూటికి నూరు శాతం అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఆదివాసీ బిడ్డలు కష్టానికి మారుపేరని సీఎం అన్నారు. వారి కష్టాలు తీరాలంటే ఈ ప్రాంతానికి సాగునీరు అందాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.
ఆదివాసీ యువతకు సాంకేతిక, నైపుణ్య విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని, 12వ తరగతి తర్వాత నైపుణ్య విద్యను అభ్యసించాలని సూచించారు. నైపుణ్యం ఉంటే జపాన్, జర్మనీ వంటి దేశాల్లోనూ అనేక అవకాశాలు లభిస్తాయని అన్నారు.మహిళల సంక్షేమంలో భాగంగా ఇందిరమ్మ చీరలను ఆడబిడ్డలకు సారెగా అందిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ ఏడాది చిలకపచ్చ రంగు చీరలను అందించబోతున్నామని వెల్లడించారు.
ఈ సందర్భంగా రాజకీయ ప్రత్యర్థులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రక్త సంబంధం లేకపోయినా సీతక్కను ఆడబిడ్డగా గౌరవిస్తున్నానని అన్నారు. మరోవైపు రక్తం పంచుకుని పుట్టిన సోదరిని ఆస్తి కోసం ఇంటి నుంచి పంపించిన ఘటనను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. కొడుకుకు బుద్ధి చెప్పాల్సిన తండ్రి ఫామ్‌హౌస్‌లో పడుకున్నాడంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి వారు తెలంగాణ ఆడబిడ్డలకు ఎలా మేలు చేస్తారని ప్రశ్నించారు.అలాగే అఘోరా పూజల పేరుతో ప్రజలు ఇబ్బందులు పడాలని కొందరు కోరుకున్నారని సీఎం ఆరోపించారు. అయితే దేవుడు తమవైపు ఉన్నాడని, రాష్ట్రంలో వర్షాలు కురిశాయని వ్యాఖ్యానించారు.
ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని, రాష్ట్రాన్ని తామంతా కలిసి అభివృద్ధి చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మన సమస్యలను మనమే పరిష్కరించుకుంటూ తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
