జగిత్యాల బాలిక శ్వేష్ట రెడ్డి అరుదైన ఘనత

  • ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
  • హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రముఖులు

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 17:
జగిత్యాల పట్టణానికి చెందిన లంకన్నగారి శ్వేష్ట రెడ్డి అనే రెండేళ్ల 11 నెలల 22 రోజుల చిన్నారి అరుదైన ఘనత సాధించింది. అసాధారణ జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.భారతదేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానులను కేవలం ఒక నిమిషంలో గుర్తించి అత్యంత వేగంగా చెప్పిన టాడ్లర్‌గా శ్వేష్ట రెడ్డి రికార్డు నెలకొల్పింది. ఈ ఘనతను ఆమె 2026 జూన్ 8న సాధించగా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ అధికారికంగా ధృవీకరించింది. ఇటీవల ఆమెకు ఐబిఆర్ అచీవర్ సర్టిఫికెట్‌తో పాటు మెడల్‌ను అందజేశారు.


2023 జూన్ 17న హైదరాబాద్‌లో జన్మించిన శ్వేష్ట రెడ్డి, జగిత్యాలకు చెందిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, పద్మలతల మనుమరాలు. తల్లిదండ్రులు వేధస్విని, పవన్‌ల కుమార్తె అయిన శ్వేష్ట చిన్న వయస్సులోనే ఈ అరుదైన ఘనత సాధించడం పట్ల కుటుంబ సభ్యులతో పాటు జిల్లా ప్రముఖులు, విద్యావంతులు, మేధావులు, కళాకారులు హర్షం వ్యక్తం చేశారు.“ఫాస్టెస్ట్ టాడ్లర్ టు రీకాల్ క్యాపిటల్స్ ఆఫ్ ఆల్ ఇండియన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్” విభాగంలో ఆమె ఈ రికార్డును నమోదు చేసింది. చిన్న వయస్సులోనే ఇంతటి ప్రతిభ కనబర్చడం రాష్ట్రానికి గర్వకారణమని పలువురు అభినందించారు.


ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచే శ్వేష్టకు మ్యాప్స్, రాష్ట్రాల పేర్లపై ఆసక్తి ఉండేదని తెలిపారు. ఆటల రూపంలో ప్రారంభమైన అభ్యాసం, ప్రతిరోజూ సాధన చేయడం వల్లే ఈ విజయాన్ని సాధించగలిగిందని పేర్కొన్నారు.అమ్మమ్మ, తాతయ్య ముసిపట్ల పద్మలత, లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, శ్వేష్ట సాధన తమ కుటుంబానికే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. ఉపాధ్యాయులు, బంధువులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

Leave a comment