ఇసుక మాఫియా చెలరేగిపోతోంది: హరీష్ రావు

By dhanadhannews.com

  • చెక్‌డ్యామ్‌ కూల్చిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వ అండదండలతోనే రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని, ముఖ్యంగా చెక్‌డ్యామ్‌లను కూల్చివేస్తూ టెర్రరిస్టులను మించిపోయే విధంగా అల్లర్లు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. రూ. 24 కోట్లతో నిర్మించిన తనుగుల చెక్‌డ్యామ్‌ను ఇసుక మాఫియా బాంబులతో పేల్చివేయడాన్ని ఆయన ఖండించారు.తనుగుల చెక్‌డ్యామ్‌ను శుక్రవారం సందర్శించిన సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, చెక్‌డ్యామ్‌ను పేల్చివేయడం వేలాది మంది రైతులపై జరిగిన ప్రత్యక్ష దాడి అని అభివర్ణించారు. ఈ ఘటన కారణంగా సుమారు 2,000 ఎకరాలకు సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.”కేసీఆర్ కడితే రేవంత్ రెడ్డి కూల్చే పాలన వచ్చింది. ఈ దుండగులను వెంటనే అరెస్టు చేసి, వారి వద్ద నుంచే నష్టం వసూలు చేసి, కఠిన శిక్షలు విధించాలి,” అని హరీష్ రావు డిమాండ్ చేశారు.


సమస్యకు ప్రభుత్వమే కారణం!


హుస్సేన్ మియా చెక్‌డ్యామ్ కూల్చినప్పుడే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని ఉంటే, ఈరోజు తనుగులలో ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదని హరీష్ రావు గుర్తుచేశారు. ఇసుక మాఫియా రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నా, ప్రభుత్వం చేతులెత్తేసిందని మండిపడ్డారు. రైతులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, ప్రభుత్వం పట్టించుకోకుండా నిద్రపోతుందా? అని ప్రశ్నించారు.


కాళేశ్వరంపై దుష్టచర్యల అనుమానం


కాలేశ్వరం ప్రాజెక్టుపై కూడా ఇసుక మాఫియా ఇదే తరహాలో దాడులు జరిగాయేమోనన్న అనుమానం కలుగుతోందని హరీష్ రావు అన్నారు. “కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం వంటి మహత్తర ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు నీళ్లు అందించారు,” అని గుర్తుచేశారు. ప్రాజెక్టు రెండు పిల్లర్లు కుంగిపోయినప్పటికీ, ఇప్పటివరకు మరమ్మతులు చేయకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.


ఇరిగేషన్ మంత్రి హామీ ఫ్లాప్!


ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఇచ్చిన ఏడాదికి ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్న హామీ పూర్తిగా ఫ్లాప్ అయిందని హరీష్ రావు విమర్శించారు. రెండు సంవత్సరాలు గడిచినా ఒక్క లక్ష ఎకరాలకు కూడా నీళ్లు అందలేదని అన్నారు.
మరోవైపు, రేవంత్ రెడ్డి కాలేశ్వరం కూలిపోయిందని చెబుతూనే, అదే కాలేశ్వరం భాగమైన మల్లన్నసాగర్ నుంచి రూ. 8,000 కోట్లు ఖర్చు చేసి మూసి నదిలో నీళ్లు తీసుకురాగలమంటారా? అని ప్రశ్నించారు.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మేల్కొని, యుద్ధ ప్రాతిపదికన కాపర్ డ్యామ్ నిర్మాణం చేసి, 2,000 ఎకరాలకు నీరు అందించే చర్యలు ప్రారంభించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
ఈ సందర్శనలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రవిశంకర్, సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, దాసరి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.