
కాటారం, జూలై 27(ధనాధన్ న్యూస్): ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, సమన్వయకర్త డాక్టర్ కె. మదన్ మోహన్ రెడ్డి సూచించారు.కాటారం రైతు వేదికలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్న మూడు రోజుల పప్పుధాన్యాలు, కూరగాయల విత్తన మేళాలో ఆయన మాట్లాడారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉండటంతో భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో పాటు సాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో పంటల ఎదుగుదల మందగించి దిగుబడులు తగ్గే అవకాశం ఉందన్నారు.అధిక నీటి అవసరం ఉన్న వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, రాగి, నువ్వులు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. అలాగే ప్రత్తి–కంది, కంది–మొక్కజొన్న వంటి అంతర పంటల విధానాలను అవలంబించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు ఆదాయంలో స్థిరత్వాన్ని సాధించవచ్చని పేర్కొన్నారు.శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ పంటల వైవిధ్యీకరణ చేపడితే వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను తగ్గించుకోవడంతో పాటు మెరుగైన దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి రైతులకు సూచించారు.
