- రిజిస్ట్రేషన్ లోపం..బ్యాంకు రుణం తిరస్కరణ..నలుగురిపై కేసు
- ప్లాట్ పత్రాల్లో గందరగోళం..ఉపాధ్యాయుడి ఫిర్యాదుతో కేసు నమోదు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ జూన్ 9:
ప్లాట్ కొనుగోలు విషయంలో సర్వే నంబర్ నమోదు లోపంతో రుణం తిరస్కరణకు గురైన బాధితుడి ఫిర్యాదు మేరకు జమ్మికుంట పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దంపల్లి గ్రామానికి చెందిన దొడ్డే దుర్గాప్రసాద్ (46), ప్రస్తుతం జమ్మికుంటలోని ఎంపీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామంలో ఉన్న అంజనా టౌన్‌షిప్‌లో 59వ నంబర్ ప్లాట్‌ను కొనుగోలు చేశారు.
ఈ ప్లాట్‌ను జొన్నతుల కోనారెడ్డి, రాఘవరెడ్డి, గర్రెపల్లి అరుణ్‌కుమార్, టి. రాజేశ్వరరావులకు సంబంధించిన మదర్ డాక్యుమెంట్ నంబర్ 3778/2024 ఆధారంగా కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే సంబంధిత లేఅవుట్‌లో ఉన్న సర్వే నంబర్లు 94, 95, 100 మాత్రమే కాగా, లేఅవుట్‌కు సంబంధం లేని సర్వే నంబర్ 103ను కూడా డాక్యుమెంట్‌లో చేర్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
లేఅవుట్ ప్రొసీడింగ్స్‌ను పరిశీలించగా సర్వే నంబర్ 103 లేకపోయినప్పటికీ, డాక్యుమెంట్ నంబర్ 2830/2025లో ఆ సర్వే నంబర్ నమోదు అయిందని తెలిపారు. ఈ కారణంగా బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసుకోగా, పత్రాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొంటూ రుణాన్ని తిరస్కరించినట్లు ఫిర్యాదుదారు వెల్లడించారు.
ఈ విషయమై తనకు ప్లాట్ విక్రయించిన వారిని సంప్రదించగా డాక్యుమెంట్ సవరణ చేస్తామని హామీ ఇచ్చి, అనంతరం కాలయాపన చేస్తూ మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.