- కౌలు చేసిన పొలం సమీపంలోనే విషం తాగి బలవన్మరణం
- పంట దిగుబడి తగ్గడం, అప్పుల భారం తట్టుకోలేక తీవ్ర నిర్ణయం

బుగ్గారం/ధనాధన్ న్యూస్ జూన్ 9:
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన కౌలు రైతు, దళిత రైతు మానాల పెద్ద దుబ్బయ్య (60) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. కౌలుకు తీసుకున్న పొలాల సమీపంలోనే ఆయన మృతదేహం లభించింది.
కుటుంబ సభ్యులు, బుగ్గారం ఎస్సై జి. సతీష్ తెలిపిన వివరాల ప్రకారం, పెద్ద దుబ్బయ్య పలువురు రైతుల భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే ఇటీవల పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం, దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ ఏడాది వరి పంట దిగుబడి చాలా తక్కువగా రావడంతో పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు, భూ యజమానులకు చెల్లించాల్సిన కౌలు డబ్బులు ఎలా తీర్చాలనే ఆందోళనలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత నాలుగు ఐదు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురై నిరాశలో ఉన్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
సోమవారం మధ్యాహ్నం జగిత్యాలకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయలుదేరిన దుబ్బయ్య రాత్రి వరకు ఇంటికి చేరుకోలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం బుగ్గారం శివారులోని చందయ్యపల్లి రోడ్డులో ఆయన కౌలుకు సాగు చేసిన పొలాల సమీపంలో మృతదేహం కనిపించింది.
సమాచారం అందుకున్న బుగ్గారం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి కుమారుడు మానాల లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, వ్యవసాయ నష్టాలు, పెరిగిన అప్పుల కారణంగా మనస్తాపానికి గురైన తన తండ్రి గుర్తుతెలియని విషపదార్థం సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి. సతీష్ తెలిపారు.
పోలీసులు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం బుగ్గారంలో లాంఛనప్రాయంగా అంతిమయాత్ర నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.మృతుడు పెద్ద దుబ్బయ్యకు భార్య, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు, మనుమలు, మనుమరాండ్లు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.