వరంగల్/ధనాధన్ న్యూస్: తెలంగాణ గడ్డపై సూర్య, చంద్రులు ఉన్నంత వరకూ ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలు, ఆడబిడ్డలకు సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తాను టీపీసీసీ అధ్యక్షుడిగా,ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యానని రేవంత్ రెడ్డి చెప్పారు.మీరు భుజాల మీద మోయబట్టే మేమంతా ఇవాళ వివిధ హోదాల్లో ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే ఆడబిడ్డల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీపై ఉంది.2014 నుంచి 2019 వరకూ బీఆర్ఎస్ మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రిగా లేరని ఆయన చెప్పారు.ప్రస్తుతం తెలంగాణ మహిళలు ఇచ్చిన తీర్పుతో మెుదటి మంత్రివర్గంలోనే కొండా సురేఖ,సీతక్కకు మంత్రులుగా అవకాశం కల్పించామని సీఎం చెప్పుకొచ్చారు.ఈ ఓరుగల్లు ఆడబిడ్డలకే మంత్రివర్గంలో ప్రముఖస్థానం ఇచ్చి నేటి సభా నిర్వహణ కార్యక్రమాన్ని సైతం వారి చేతుల్లోనే పెట్టామని రేవంత్ తెలిపారు.ఇదే కాకుండా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కడియం కావ్యను పార్లమెంట్‌కు పంపించామని ఆయన చెప్పారు.ఆమె తెలంగాణ సమస్యలపై పార్లమెంట్లో గళం విప్పుతోందని అన్నారు.పాలకుర్తిలో ఓ రాక్షసుడు రాజ్యమేలుతుంటే యశస్విని రెడ్డి అనే సోదరి ఆ రాక్షసుడిని ఎన్నికల్లో ఓడించి పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేసిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీ కూడా ఆడబిడ్డనే అని ఆయన తెలిపారు.అనేక మంది మహిళా అధికారులు పలు జిల్లాలకు కలెక్టర్లుగా ఉన్నారని వెల్లడించారు. వరంగల్ కార్పొరేషన్ మేయర్‌గా కూడా ఓ మహిళలే ఉందని సీఎం చెప్పుకొచ్చారు.వారి రుణం ఇంకా తీర్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి చెప్పారు..
