జగిత్యాల,జూలై 13 (ధనాధన్ న్యూస్): జగిత్యాల పట్టణంలోని రైతు బజార్ ముందు రహదారిపై రైతులు కూరగాయలు విక్రయించడం వల్ల గత కొంతకాలంగా తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొంది. ముఖ్యంగా విద్యానగర్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు, సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లే రోగులు, అంబులెన్స్‌లు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యపై స్పందించిన ట్రాఫిక్ ఎస్‌ఐ మల్లేశం సోమవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి, మున్సిపల్ సిబ్బందితో కలిసి రైతు బజార్ ముందు రహదారిపై వ్యాపారం నిర్వహిస్తున్న రైతులకు అవగాహన కల్పించారు. రహదారిపై కాకుండా రైతు బజార్ ఆవరణలోనే కూరగాయల విక్రయాలు నిర్వహించాలని సూచిస్తూ అవసరమైన చర్యలు చేపట్టారు.


దీంతో రైతు బజార్ ముందు ఉన్న ట్రాఫిక్ రద్దీ తగ్గి, విద్యానగర్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలు సజావుగా కొనసాగాయి. ముఖ్యంగా సమీప ఆసుపత్రులకు వెళ్లే రోగులు, అంబులెన్స్‌లు, ఇతర వాహనదారులకు గణనీయమైన ఉపశమనం లభించింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది ట్రాఫిక్ పోలీసులకు సహకరించి, రైతులు రైతు బజార్ లోపలే వ్యాపారం నిర్వహించేలా చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి మాట్లాడుతూ, “రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత. రైతు బజార్‌లో నిజమైన రైతులకు సక్రమంగా స్థలాలు కేటాయించి, రహదారులపై వ్యాపారాలు జరగకుండా సంబంధిత శాఖలు నిరంతరం చర్యలు తీసుకోవాలి” అని అన్నారు.
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ట్రాఫిక్ ఎస్‌ఐ మల్లేశంను స్థానిక ప్రజలు అభినందించారు. ఇలాంటి చర్యలు నిరంతరం కొనసాగించాలని కోరారు.

Leave a Reply