బుగ్గారం/ధనాధన్ న్యూస్: బుగ్గారం మండలంలో ఆర్టీఐ దరఖాస్తుల కారణంగానే 40 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రావాల్సిన బిల్లులు నిలిచిపోయాయంటూ కొన్ని దినపత్రికల్లో వచ్చిన వార్తలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని సీనియర్ ఆర్టీఐ కార్యకర్త చుక్క గంగారెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం బుగ్గారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)కు వినతిపత్రం సమర్పించారు. ఎంపీడీవో తరఫున ఎంపీవో బింగి సురేష్ వినతిపత్రాన్ని స్వీకరించారు.

ఆర్టీఐ దరఖాస్తుల వల్లే ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు నిలిచిపోయాయనే ప్రచారం వాస్తవమా? కాదా? అనే అంశంపై అధికారులు తక్షణమే స్పష్టత ఇవ్వాలని గంగారెడ్డి కోరారు. బిల్లుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు అధికారికంగా బహిరంగ ప్రకటన చేయడంతో పాటు, వాస్తవ పరిస్థితులను లిఖితపూర్వకంగా కూడా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

ఒకవేళ ఆర్టీఐ దరఖాస్తుల కారణంగానే బిల్లులు నిలిచిపోయినట్లయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. అదే సమయంలో ప్రచారం అసత్యమని తేలితే, ఆ ప్రచారం వెనుక ఉన్న కారణాలను, బాధ్యులను గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కొంతమంది వ్యక్తులు తమ స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం లేదా తమపై ఉన్న ఆరోపణలు, ఇతర అక్రమ కార్యకలాపాలను కప్పిపుచ్చుకునేందుకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఉపయోగించుకుంటున్నారనే సమాచారం ఉందని గంగారెడ్డి వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆర్టీఐ కార్యకర్తల వల్లే తమ ఇళ్ల బిల్లులు రావడం లేదంటూ లబ్ధిదారుల్లో అపోహలు కల్పించి, వారిని ఆర్టీఐ కార్యకర్తలు, ఉద్యోగులు, అధికారులపైకి వెళ్లేలా ప్రేరేపిస్తున్నారనే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని గంగారెడ్డి కోరారు. అసత్య ప్రచారం జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు ప్రచారాలకు తావులేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఎంపీడీవో యం. సుమంత్‌ను కోరారు.

Leave a Reply