హుజురాబాద్/ధనాధన్ న్యూస్:
హుజురాబాద్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం హుజురాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచే ప్రతిపాదనను బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందుకు తెచ్చారని గుర్తుచేశారు. బీసీలకు న్యాయం చేసే విషయంలో తమ పార్టీ ఎప్పటికీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు.
రైతుల సమస్యలపై కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టిన కౌశిక్ రెడ్డి – “రైతులకు కనీసం యూరియా బస్తాలు అందించలేని కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదు. ఆరు గ్యారెంటీల అమలులో పూర్తిగా విఫలమైంది. కేసీఆర్ హయాంలో రైతులు సంతోషంగా ఉండగా, కాంగ్రెస్ వచ్చాక నడిరోడ్డుపై నిలబెట్టింది” అని విమర్శించారు.
అలాగే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుజురాబాద్ నియోజకవర్గంలోని 107 గ్రామపంచాయతీలు, రెండు మున్సిపాలిటీల అభివృద్ధికి వందల కోట్ల రూపాయలు కేటాయించారని గుర్తు చేశారు. అభివృద్ధి చేసిన పార్టీ ఎవరో ప్రజలకు బాగా తెలుసని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
జర్నలిస్టులకు కేటాయించిన నివేశన స్థలాలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని, ఇబ్బందులు కలిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
ముందస్తు ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతోందని, మండలాల వారీగా సమన్వయ సమావేశాలు జరుగనున్నాయని తెలిపారు.
అక్టోబర్ 4న ఉదయం వీణవంక, సాయంత్రం హుజురాబాద్, అక్టోబర్ 5న ఉదయం ఇల్లంతకుంట, సాయంత్రం జమ్మికుంట, అక్టోబర్ 6న ఉదయం కమలాపూర్‌లో సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
“రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ తరఫున ఎవరు పోటీ చేసినా తాను పూర్తి స్థాయి అండగా ఉంటాను. హుజురాబాద్ గడ్డ బిఆర్ఎస్ పటిష్ట కోటగానే కొనసాగుతుంది” అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
