- జమ్మికుంటలో గుంతల రోడ్డుపై ప్రజల తిప్పలు!
- రోడ్డు మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలి
- మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించాలి
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, పట్టణ ప్రజల ప్రాణాల పట్ల వారి ఉదాసీనతకు నిలువెత్తు నిదర్శనంగా మారింది జమ్మికుంట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పరిసర ప్రాంతం. బ్రిడ్జి డౌన్ ప్రాంతంలో ఒకవైపు రిలయన్స్ పెట్రోల్ పంపుకు ముందు, మరొకవైపు బస్టాండ్‌కు వెళ్లే దారిలో భారీగా, ప్రమాదకరంగా ఏర్పడిన గుంతలు గత కొంతకాలంగా వాహనదారులకు,స్థానికులకు నరకాన్ని చూపుతున్నాయి.ప్రజల నుంచి పన్నుల వసూళ్లలో మాత్రం మున్సిపాలిటిని రాష్ట్రం లో మొదటి స్థానంలో ఉంచుతున్న మున్సిపల్ అధికారులు , పట్టణ అభివృద్ధి పై మాత్రం పట్టనట్టు ఉంటే ఎలాగని ప్రజలు వాపోతున్నారు.పన్నులు సకాలంలో చెల్లిస్తూ పట్టణ అభివృద్ధి సహకరిస్తున్న ప్రజల బాగోగుల పట్టింపులో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం తగదని అంటున్నారు.
ప్రమాదకరమైన ఈ గుంతల వల్ల నిత్యం వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు కింద పడి గాయాలపాలవుతున్నారు. పండుగల సీజన్ లో రద్దీ పెరిగిన సమయంలో, ఏ క్షణంలోనైనా తీవ్రమైన ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గుంతల కారణంగా ఏర్పడుతున్న ట్రాఫిక్ అంతరాయాలు,రోజువారీ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించాలని వాహనదారులు,ప్రజలు ఏకగ్రీవంగా కోరుతున్నారు.
“మున్సిపల్ కమిషనర్ వెంటనే చొరవ తీసుకుని, ఈ గుంతలను శాశ్వతంగా మరమ్మత్తులు చేయించి,వాహనదారులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రత కల్పించాలి” అని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
