ఘనంగా జ్యోతిభా పూలే జయంతి వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఉడిగె విజయ ముఖ్య అతిథిగా హాజరై, మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా సర్పంచ్ ఉడిగె విజయ మాట్లాడుతూ, మహనీయుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బోరగళ్ళ మల్లేశం మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పోరాటం చేసిన మహనీయుడని తెలిపారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.


అలాగే మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తూ, 1848లో మహిళల కోసం పాఠశాలను స్థాపించి విద్యా అవకాశాలు కల్పించిన తొలి సంస్కర్తలలో ఆయన ఒకరని వివరించారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.


ఈ కార్యక్రమంలో దుద్దెనపల్లి గ్రామ ఉపసర్పంచ్ కొమ్ముల రాజు, అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మొలుగూరి భూపతి, ఉపాధ్యక్షులు దూల సురేష్, మొలుగూరి కిరణ్, మాజీ సర్పంచ్ తాటిపెళ్లి యుగంధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య, మాజీ ఎంపీటీసీ మట్టెల రవీందర్, దొమ్మట వీరన్న, సంపూర్ణ, తాళ్లపల్లి చిన్న వెంకటేశం, బోరగల్ల రాజేందర్, కవ్వంపెళ్లి రాకేష్, తునికి దేవేందర్, అంతడుపుల రాజు, చల్ల వెంకన్న, పర్షవేణి విజయ్, కొండబత్తుని వీరస్వామి, వేముల రాజు తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment