- తహసీల్దార్,మున్సిపల్ కమిషనర్‌కు యూత్ కాంగ్రెస్ వినతి
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: మ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో అక్రమంగా నమోదైన బోగస్ ఓట్లను వెంటనే తొలగించాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ నాయకులు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. జమ్మికుంట తహసీల్దార్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్‌లను కలిసి ఓటరు జాబితాలోని అక్రమాలపై ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి సజ్జు మాట్లాడుతూ, కొందరు రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం మున్సిపాలిటీతో సంబంధం లేని వ్యక్తుల పేర్లను వార్డుల్లోని ఇంటి నెంబర్లపై అక్రమంగా నమోదు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ‘ఓటు చోరీ’ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల అధికారులు వెంటనే వార్డుల వారీగా సమగ్ర విచారణ జరిపి దొంగ ఓట్లను గుర్తించాలని, ఓటరు జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ, ప్రజలు కూడా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డే సంధ్యా నవీన్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు పంజాల అజయ్, ప్రశాంత్ సన్నీ, మండల ఉపాధ్యక్షులు దేవునూరి వినయ్, ఆకినపల్లి శ్యామ్, సేవాదళ్ పట్టణ అధ్యక్షులు బండి పవన్, వార్డు సభ్యులు తాళ్లపెల్లి అంజి, నాయకులు అజ్జు, జావిద్, ప్రవీణ్, అజయ్, గణేష్, సూర్యతేజ రెడ్డి, సాయితేజ, భగవాన్, అస్సాన్ తదితరులు పాల్గొన్నారు.
