చెక్ డ్యాం కుంగడంపై బీఆర్ఎస్ అబద్ధాల ప్రచారం

By dhanadhannews.com

  • ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చాక చర్యలు
  • హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ప్రణవ్ బాబు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తనుగుల పరిధిలోని శంభునిపల్లి-గుంపుల చెక్ డ్యాం కుంగిపోయిన సంఘటనపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అబద్ధపు ప్రచారాలు, ఆరోపణలను హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ గురువారం తీవ్రంగా ఖండించారు. రామభద్ర స్వామి సాక్షిగా బీఆర్ఎస్ అబద్ధాలు చెప్తోందని మండిపడ్డారు.
జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో విలేకరుల సమావేశం నిర్వహించిన ప్రణవ్, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.


ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పైనే చర్యలు
చెక్ డ్యాం కుంగడంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని ప్రణవ్ తెలిపారు. మరో నాలుగైదు రోజుల్లో పూర్తిస్థాయి ఎఫ్ఎస్ఎల్ (Forensic Science Laboratory) నివేదిక అందుతుందని, ఆ నివేదిక ఆధారంగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.


కౌశిక్ రెడ్డికి ‘కాంక్రీట్ కి-గుండురాయి కి’ తేడా తెలియదా?
బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ రెడ్డి చెక్ డ్యాంపై చేస్తున్న వ్యాఖ్యలను ప్రణవ్ గట్టిగా తిప్పికొట్టారు. “కాంక్రీట్ కి, గుండు రాయికి తేడా తెలవని కౌశిక్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటు. ఆయన మెదడు సరిగా పనిచేయడం లేదు. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు” అని విమర్శించారు.


పేలుడు ఆరోపణలు నిరాధారం: చెక్ డ్యాంను పేల్చారన్న ఆరోపణలు హాస్యాస్పదం. చిన్న పటాకా పేలిస్తేనే ఆనవాళ్లు చల్లాచెదురు అవుతాయి. అంత పెద్ద చెక్ డ్యాం పేలితే ఆనవాళ్లు ఎందుకు కనిపించడం లేదని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు.
నాసిరకం నిర్మాణమే కారణం: నాసిరకమైన నిర్మాణం, కమీషన్ల కక్కుర్తి కోసమే ఇసుకపై నిర్మాణం చేపట్టడం వలన ఈ నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. 2022లో కూడా ఈ చెక్ డ్యాంతో పాటు విలాసాగర్, తనుగుల, మల్లారెడ్డిపల్లిలలోని నాలుగు చెక్ డ్యాంలు కూలిపోయిన విషయాన్ని గుర్తుచేశారు.


ఇసుక మాఫియాపై విమర్శలు
ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియాకు ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ నాయకులే అని ప్రణవ్ ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు వారే మానేరును చెరపట్టారని పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా హరీష్ రావు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
“హరీష్ రావును రాజీనామాకు తీసుకొచ్చింది కౌశిక్ రెడ్డియే”
ఐదేళ్లు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, కౌశిక్ రెడ్డి మాయలో పడ్డారని ప్రణవ్ వ్యంగ్యంగా అన్నారు. అందుకే హరీష్ రావును రాజకీయం నుండి రాజీనామా అడిగే వరకు కౌశిక్ రెడ్డి తీసుకొచ్చారని పేర్కొన్నారు. అబద్ధాలు చెప్పడంలో బీఆర్ఎస్ పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వవచ్చని ఎద్దేవా చేశారు.
ఈ సమావేశంలో పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి, జమ్మికుంట పట్టణ, మండల అధ్యక్షులు రమేష్, పరశు రామ్, మహిళా అధ్యక్షురాళ్ళు రేణుక, స్వప్నతో పాటు సీనియర్ నాయకులు గుడెపు సారంగపాణి, ఆరుకాల వీరేశలింగం, పొనగంటి మల్లయ్య, దేశినీ కోఠి, సదానందం, శివ, సలీం, శ్రీను, రామస్వామి మాజీ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్, మైనారిటీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.