- పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
- మీడియాతో కాంగ్రెస్ మండల సమన్వయ కమిటీ సభ్యులు

నడికూడ,ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు, క్రమశిక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు.నడికూడ మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చర్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. చర్లపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఓటమికి చాడ తిరుపతిరెడ్డి కారణమయ్యారని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకునేందుకు తమ వద్ద పూర్తి సమాచారం, ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.పార్టీలో గౌరవప్రదమైన హోదాల్లో ఉన్న నాయకులను దుర్భాషలాడటం, పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం వంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా, మరో రెండు గ్రామాలకు చెందిన ఇద్దరు నాయకులపై కూడా ఫిర్యాదులు, నివేదికలు పార్టీ అధిష్ఠానానికి అందాయని తెలిపారు. వాటిపై పరిశీలన అనంతరం త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉంటూ పార్టీ నిర్ణయాలు, ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని నాయకులు సూచించారు.
ఈ సమావేశంలో మండల సమన్వయ కమిటీ సభ్యులు మల్లారెడ్డి, కల్పనదేవి, రవీందర్ యాదవ్, సమ్మయ్య, సదానందం, నడికూడ సర్పంచ్ కుడ్ల మలహల్రావు, ఉపసర్పంచ్ సంపత్, నారాయణ, సురేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
