రంగాపూర్ కల్వరి చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

By dhanadhannews.com

  • పేదలకు వస్త్ర దానం చేసిన సర్పంచులు

హుజురాబాద్,ధనాధన్ న్యూస్:మండల పరిధిలోని రంగాపూర్ కల్వరి టెంపుల్‌లో క్రీస్తు జన్మదిన వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. చర్చి ఫాదర్ రెవరెండ్ డాక్టర్ పి.ఆర్. నెల్సన్ పర్యవేక్షణలో జరిగిన ఈ సంబరాల్లో నియోజకవర్గ నలుమూలల నుంచి క్రైస్తవ సోదరులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు నూతన వస్త్రాలు ధరించి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
సందడిగా సాంస్కృతిక ప్రదర్శనలు:
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ముఖ్యంగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు, యువత ప్రదర్శించిన క్రీస్తు జన్మవృత్తాంత నాటికలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు రంగాపూర్ సర్పంచ్ కుంట అరుణ తిరుపతిరెడ్డి, రాంపూర్ సర్పంచ్ ముశం సంగీత గణేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రేమ, కరుణ, శాంతిని బోధించిన క్రీస్తు మార్గం అందరికీ ఆదర్శనీయమని, బైబిల్ ప్రవచనాలు మనిషిని సన్మార్గంలో నడిపిస్తాయని కొనియాడారు.
సేవలోనూ ఆదర్శం:
పండుగ పూట సేవా దృక్పథాన్ని చాటుతూ బొడ్డు రాజరత్నం-కమల దంపతుల సౌజన్యంతో 15 మంది పేద మహిళలకు అతిథుల చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఇటీవల వార్డు మెంబర్‌గా ఎన్నికైన బండ మాధవి రమేష్‌తో పాటు, సంఘ సేవలో విశేష కృషి చేస్తున్న ఫాదర్ నెల్సన్-సుదిన దంపతులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.
మహా జ్ఞాన నిధి బైబిల్ – ఫాదర్ నెల్సన్:
సందేశం ఇస్తూ ఫాదర్ డాక్టర్ నెల్సన్.. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదని, అది ఒక ఉన్నతమైన జీవన మార్గమని పేర్కొన్నారు. ప్రపంచ శాంతికి మార్గం చూపే బైబిల్ ఒక మహా జ్ఞాన నిధి అని ఆయన ఉద్ఘాటించారు. అనంతరం అతిథులందరూ కలిసి కేక్ కట్ చేశారు. వేడుకల అనంతరం భక్తులందరికీ క్రిస్మస్ విందు ఏర్పాటు చేశారు.