అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులను ఆదుకోవాలి

By dhanadhannews.com

  • షరతులు లేకుండా వరికి 500 బోనస్ చెల్లించాలి
  • తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) జిల్లా కార్యదర్శి పైడిపల్లి రాజు

కరీంనగర్(ధనాధన్ న్యూస్)మే18:గత రెండు రోజుల నుండి రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యం కారణంగా అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని  ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి పైడిపల్లి రాజు ఒక ప్రకటనలో శనివారం  ప్రభుత్వాన్ని కోరారు. 

ఈ సందర్భంగా పైడిపల్లి రాజు మాట్లాడుతూ మార్కెట్ కల్లాలలో,ఐకెపి కేంద్రాలలో  ఉన్న ధాన్యం పూర్తిగా తడిసి పోయిందని, పండ్ల తోటలు మామిడి,సపోటా బొప్పాయి తదితర కాయలు ఈదురు గాలులకు నేలమట్టమై తీవ్ర నష్టం వాటిలిందని  ఆయన పేర్కొన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం  రైతుల పట్ల సానుకూలంగా స్పందిస్తున్నందున ప్రభుత్వ అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి అంచనాలను ప్రభుత్వానికి అందించాలని వారు అధికారులను కోరారు.
తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి రైతులను కాపాడాలని ఆయన అన్నారు. పిడుగుపాటు వల్ల చాలా ప్రాంతాల్లో ఆవులు గేదలు మృతి చెందుతున్నాయని వీటికి అంచనా వేసి నష్ట పరిహారం వెంటనే చెల్లించాలని, ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి రైతన్నకు ప్రభుత్వం భరోసాగా నిలవాలని,సన్న రకం దొడ్డు రకం అని తేడా లేకుండా 500 రూపాయలు బోనసును  వెంటనే  అందజేయాలని అన్నారు.

సన్న వడ్లు పండించే రైతులకు మాత్రమే 500 బోనస్ చెల్లించనున్నట్లు ప్రకటనలు వస్తున్నాయని దీంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతుందని ఆరోపించారు.

మన తెలంగాణ రాష్ట్రంలో 80% రైతులు దొడ్డు  వడ్లనుపండిస్తారని సన్న వడ్లను 20 శాతం మంది మాత్రమే పండిస్తారని దొడ్డు వడ్లను పండించే రైతులు అధికంగా సన్నాచిన్న కారు రైతులేనని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరిస్తే  కాలగర్భంలో కలవక తప్పదని ఆయన హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అన్నింటిని అమలు చేసి ఆదుకోవాలని పైడిపల్లి రాజు  ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.