జగిత్యాల/ధనాధన్ న్యూస్: సారంగపూర్ మండలంలోని పెంబట్ల, కోనపూర్ గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదే సమయంలో పెంబట్ల గ్రామానికి చెందిన పాస్తం స్వప్న, ఆమె సోదరులు పరమేష్, దుర్గేష్ నివాస గృహం భారీ వర్షాల కారణంగా పూర్తిగా కూలిపోయింది.ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కూలిన ఇంటిని పరిశీలించిన అనంతరం మండల తహసీల్దార్ (ఎంఆర్ఓ), ఆర్డీవోతో ఫోన్‌లో మాట్లాడి, ప్రభుత్వం నిబంధనల ప్రకారం పూర్తిగా కూలిన ఇంటికి అందాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే మంజూరు చేయాలని కోరారు.అలాగే, బాధిత కుటుంబానికి ప్రభుత్వ పథకం కింద కొత్త ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీనికి స్పందించిన అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించిన అనంతరం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొత్త ఇంటి మంజూరుకు అధికారులతో చర్చిస్తానని తెలిపారు. అలాగే, ఇల్లు నిర్మాణ పనులు ప్రారంభించినప్పుడు తమ వంతు ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని పేర్కొన్నారు. తక్షణ అవసరాల కోసం బాధిత కుటుంబానికి నగదు సహాయం అందించి అండగా నిలిచారు.

Leave a Reply