- కేసిఆర్,కేటీఆర్ లకు చిత్తశుద్ధి ఉంటే గంగుల నుండి జంగిలి వరకు అందరిని బీఆర్ఎస్ నుండి తొలగించాలి
- కళంకిత కార్పొరేటర్ లను బిఆర్ఎస్ నుండి ఎందుకు సస్పెండ్ చేయట్లేదు.?
- జమ్మికుంటలో దాడి చేసిన కౌన్సిలర్ బి ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరి నెల రోజులే అయింది
- విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి ఆదేశాలతో తక్షణమే షోకాజ్ జారీ చేశాం
- కౌన్సిలర్ సరైన వివరణ ఇవ్వకుంటే తదుపరి చర్యలకు ఉపక్రమిస్తాం
- జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి
కరీంనగర్,ధనాధన్ న్యూస్:
కళకళలాడే కరీంనగర్ బిఆర్ఎస్ పార్టీ పుణ్యమాని, అవినీతి,అక్రమాలకు నిలయంగా,కరప్షన్ కలెక్షన్ కు కేరాఫ్ గా మారిందని జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.2014 నుంచి నిన్నటి వరకు జరిగిన భూమాఫియా ఇసుక మాఫియా గ్రానైట్ మాఫియా గుట్కా మాఫియా మట్కా మాఫియా జట్కా మాఫియా నడిపింది,బిఆర్ఎస్ నేత లేనని వీరందరూ నేరుగా ఇంటి నుండి జైలు బాట పట్టారని జైలుకు వెళ్లి వస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే మాజీ మంత్రి గంగుల కమలాకర్ మొదలుకొని జంగిలి సాగర్ వరకు అందర్నీ తక్షణమే టిఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.ఈ పాపాలలో మంత్రి గంగుల ప్రమేయమే లేకుంటే గంగుల అనుచరులందరూ జైలుకు ఎందుకు వెళుతున్నారని నిందితులుగా ఎందుకు మారుతున్నారని ప్రశ్నించారు.ఆనాడు టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఈ పాపాలకు అడ్డుకట్ట వేసి ఉంటే నేడు ఈ పరిణామాలు పునరావృతం అయ్యేవా అని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టే నిన్న జమ్మికుంట లో జరిగిన దాడి ఘటనలో విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు దాడి చేసిన కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన కౌన్సిలర్ కు తక్షణమే షోకాజ్ నోటీసు జారీ చేశామని,సదరు కౌన్సిలర్ సరైన వివరణ ఇవ్వకుంటే పై చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టం చేశారు.గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనల్లో ఏ నాయకుడు కరీంనగర్ నుంచి జైలుకు వెళ్లలేదని గుర్తు చేశారు.ఇటీవలే జమ్మికుంటకు చెందిన ఓ నాయకుడితో కలిసి దాడి చేసిన కౌన్సిలర్ కాంగ్రెస్లో చేరి నెల రోజులే అయిందని అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దాడుల సంస్కృతిని చూస్తూ ఊరుకోదని కాంగ్రెస్లో ఇలాంటి సాంప్రదాయానికి తావు లేదని చెప్పారు.బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు చేసిన పెద్ద పెద్ద దందాలను వదిలిపెట్టి జమ్మికుంటలో కౌన్సిలర్ దాడి అంశాన్ని భూతద్దంలో పెట్టి చూడటం టిఆర్ఎస్ పార్టీ నాయకులకు సిగ్గుచేటన్నారు.మంత్రి గంగుల కమలాకర్ ను సైతం అరెస్టు చేయాలని నకిలీ డాక్యుమెంట్ పత్రాలతో ముస్లింలకు సంబంధించిన పవిత్రమైన వక్ఫ్ బోర్డు ల్యాండ్ ను కబ్జా చేసిన నీచ చరిత్ర అని గంగుల కమలాకర్ పై వక్ఫ్ బోర్డు అంశంలో సమగ్ర విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.తాము చేసినవన్నీ సక్రమం,ఇతరులు చేస్తే అక్రమం అని అనడం బిఆర్ఎస్ పార్టీ నాయకులు మానుకోవాలని హితువు పలికారు.తోట రాములు,చీటి రామారావు, జంగిలి సాగర్,సూదగోని కృష్ణ గౌడ్,తోట శ్రీపతి రావు, కొమ్ము భూమయ్య,కొల ప్రశాంత్,నిన్నటి నందేల్లి మహిపాల్ వరకు ఇలా కొందరు..రాబోయే రోజుల్లో మరెందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని అన్నారు.బండి సంజయ్ మాయ మాటలతో సర్పంచ్లను మోసం చేస్తున్నారని బండి సంజయ్ మాటలు విని సర్పంచులు మోసపోకూడదని చెప్పారు.బిజెపి,బీఆర్ఎస్ ఒకటేనని మరోసారి తేటతెల్లమవుతుందని బిజెపి టిఆర్ఎస్ మోసాల చరిత్రతో స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు.బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు కర్రును కాల్చి వాత పెడతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్,చొప్పదండి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రాజేశం,జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి రాముడి రాజిరెడ్డి,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్,సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ ఎండి ఆమీర్,తదితరులు ఉన్నారు.
