మహాముత్తారం, జూలై 30(ధనాధన్ న్యూస్): మండలంలోని మాదారం ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి (డీటీడబ్ల్యూఓ)పై చర్యలు తీసుకోవాలని ఆర్‌వైఏ (RYA), ఏఐఎస్‌ఏ (AISA), కేవీపీఎస్ (KVPS) జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఏడాది కాలంగా మాదారం ఆశ్రమ పాఠశాల అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని ఆరోపించారు. విద్యార్థులకు వంటలో నాణ్యతలేని పామ్ ఆయిల్ వినియోగిస్తున్నారని, దీనివల్ల వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.అలాగే, పాఠశాలలో మరుగుదొడ్లు, స్నానపు గదులు తగినంతగా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా శిథిలావస్థలో ఉన్న భవనాల్లోకి వర్షపు నీరు చేరుతుండటంతో పాటు పాములు, తేళ్లు వచ్చే ప్రమాదం నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.హాస్టల్ పరిసరాల్లో గడ్డి, నిల్వ నీరు పేరుకుపోయాయని, స్నానాల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు తాగునీటి నాణ్యత కూడా సరిగా లేదని ఆరోపించారు. ఈ సమస్యలను పది రోజుల క్రితమే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.ఇటీవల డీటీడబ్ల్యూఓ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేసి వెళ్లిపోయారని, కానీ సమస్యల పరిష్కారంపై ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. హాస్టల్‌లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ కూడా అమలు కావడం లేదని పేర్కొన్నారు.సాయంత్రం 6 గంటలలోపు జిల్లా స్థాయి అధికారులు ఆశ్రమ పాఠశాలను సందర్శించి సమస్యలను పరిశీలించాలని, వర్షాలు కొనసాగేంత వరకు విద్యార్థులను సురక్షితమైన భవనానికి తరలించాలని డిమాండ్ చేశారు. అధికారులు వచ్చే వరకు ఆశ్రమ పాఠశాల ఎదుటే నిరసన కొనసాగిస్తామని తెలిపారు.అధికారులు నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తే విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Leave a Reply