ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు:డాక్టర్ భోగ శ్రావణి

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 17: జగిత్యాల అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలని, కేంద్ర విద్యాలయానికి స్థలం కేటాయింపును అడ్డుకుంటున్నది ఎవరో స్పష్టం చేయాలని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ భోగ శ్రావణి డిమాండ్ చేశారు. జగిత్యాలలోని కమల నిలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.అధికారిక కార్యక్రమాల్లో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు కనీస మర్యాదలు కూడా పాటించడం లేదని ఆమె విమర్శించారు. సభా మర్యాదల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యేకు ఉందా అని ప్రశ్నించారు. కార్యక్రమాల్లో పెయిడ్ బ్యాచ్‌లతో పార్టీ నినాదాలు చేయించడం, కావాలనే రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించడం కాంగ్రెస్ నాయకులకు అలవాటైందని ఆరోపించారు.


గత పాలకులు హుందాతనంతో వ్యవహరించారని, వారిని చూసైనా ప్రస్తుత ప్రజాప్రతినిధులు నేర్చుకోవాలని సూచించారు. తాను మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా కార్యక్రమాన్ని ముగించిన విషయాన్ని గుర్తు చేశారు.కోరుట్ల, జగిత్యాల పట్టణాల అభివృద్ధి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉన్న సమయంలో సెంట్రల్ డివైడర్లను రాళ్లతో కాకుండా కాంక్రీట్‌తో నిర్మించాలని అధికారులకు లేఖ రాసింది మీరే కాదా అని ప్రశ్నించారు.


గతంలో ఎంపీ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరిస్తానని చెప్పి కేంద్ర మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే స్వార్థ రాజకీయాల కారణంగానే కేంద్ర విద్యాలయానికి వాలంటరీ స్థలాన్ని కేటాయించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.వాలంటరీ స్థలంలో జరుగుతున్న అక్రమ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అమృత్ 2.0 పథకం కింద రాయికల్‌కు రూ.15 కోట్లు, జగిత్యాలకు రూ.38.60 కోట్లు మంజూరైనప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని విమర్శించారు. శంకుస్థాపన జరిగి సంవత్సరం గడిచినా పనులు ముందుకు సాగకపోవడం విచారకరమన్నారు.


యావర్ రోడ్ విస్తరణ విషయంలో ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు కలిసి మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. రోడ్డును 100 అడుగులకు విస్తరించేందుకు గెజిట్ ఇప్పటికే విడుదలైందని, కొలతలు పూర్తై సంబంధిత ఏజెన్సీకి చెల్లింపులు కూడా జరిగాయని తెలిపారు. అయినప్పటికీ కొత్తగా కొలతల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.అవసరమైతే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటానని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, నిజంగా ధైర్యం ఉంటే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుని ప్రజల మధ్య తిరగాలని సవాల్ విసిరారు. చిల్లర రాజకీయాలు మానుకుని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు.ఎమ్మెల్యే రాజకీయ వైఖరిని ఒక్కొక్కటిగా ప్రజల ముందుకు తీసుకువస్తామని హెచ్చరించిన డాక్టర్ భోగ శ్రావణి, భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూ వారి గొంతుకగా నిలుస్తుందని స్పష్టం చేశారు.


ఈ సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, జిల్లా కోశాధికారి సుంకేట దశరథరెడ్డి, సిరిపురపు శ్రీనివాస్, గట్టుపల్లి జ్ఞానేశ్వర్, దూరిశెట్టి మమత, ఓడ్నాల రమేష్, గుండేటి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment