సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరికి
రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవ పురస్కారం

By dhanadhannews.com

హుజురాబాద్ /ధనాధన్ న్యూస్:
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరిని రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. గత 30 సంవత్సరాలుగా పత్రికా రంగంలో ఆయన అందిస్తున్న నిస్వార్థ, విశిష్ట సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు.మానవ విలువల పరిరక్షణ సేవా సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ప్రజాకవి నాగుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతి మెయిన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పలు సంస్థల వ్యవస్థాపకులు, ఇంటర్నేషనల్ గ్లోబల్ ఈవెంట్ నిర్వాహకులు, అంతర్జాతీయ భారత్ వరల్డ్ రికార్డు గ్రహీత కదరి వెంకటరమణరావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్ర మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అలాగే డాక్టర్ శివ నాగార్జున రెడ్డి, ఫిలిం ఆర్టిస్టు ఐశ్వర్య, డాక్టర్ పి. ఝాన్సీరామ్ లు మండల యాదగిరికి శాలువా కప్పి, సర్వోత్తమ సేవ పురస్కారాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, గత మూడు దశాబ్దాలుగా మండల యాదగిరి పత్రికా రంగంలో అనేక ఆటుపోటులను ఎదుర్కొంటూ, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా నిస్వార్థంగా సేవలందిస్తున్నారని ప్రశంసించారు. ఎలాంటి స్వార్థ ఆశలు లేకుండా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, సామాజిక బాధ్యతతో జర్నలిజాన్ని కొనసాగించడం ఆయన ప్రత్యేకతగా పేర్కొన్నారు. ఇలాంటి సేవలు వెలకట్టలేనివని, అందుకే రాష్ట్రస్థాయి అవార్డుతో సత్కరించడం గర్వంగా ఉందని తెలిపారు.మానవతా విలువలను పెంపొందించే దిశగా జర్నలిస్టులు నిరంతరం కృషి చేయాలని, సేవా భావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మండల యాదగిరి మరిన్ని సంవత్సరాలు జర్నలిస్టుగా సేవలందించి, ప్రజలు–ప్రభుత్వం నుండి మరిన్ని గుర్తింపులు, అవార్డులు, సత్కారాలు పొందాలని ఆకాంక్షించారు.అదేవిధంగా పత్రికా రంగంలో పాతికేళ్లకు పైగా సేవలందిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం జీవనోపాధి భద్రతతో పాటు ఆర్థిక సహాయం కల్పించాలనే సూచనలు కూడా ఈ సందర్భంగా చేశారు.