
హైదరాబాద్/ధనాధన్ న్యూస్: నూర్‌బాషా, దూదేకుల ముస్లిం సమాజ సంక్షేమం కోసం 2010లో జారీ చేసిన జీవోను వెంటనే అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముస్లిం నూర్‌బాషా దూదేకుల బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ జేఏసీ ప్రతినిధులు సీఎం ప్రజావాణికి వినతిపత్రం సమర్పించారు.
2010 మే 3న మైనారిటీ వెల్ఫేర్ శాఖ జారీ చేసిన జీవో ఎంఎస్ నం.125 ప్రకారం నూర్‌బాషా, దూదేకుల ముస్లింల సహకార సంఘాలు, ఫైనాన్స్ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసి అమలు చేయాలని జేఏసీ ప్రతినిధులు కోరారు. ఫెడరేషన్ ద్వారా ఆర్థిక సహాయం, విద్యా స్కాలర్షిప్లు, నైపుణ్యాభివృద్ధి, గృహ నిర్మాణం, స్వయం ఉపాధి పథకాలు అందించాల్సి ఉన్నప్పటికీ, జీవో జారీ చేసి 15 సంవత్సరాలు గడిచినా అమలు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
జీవో అమలు కాకపోవడం వల్ల నూర్‌బాషా, దూదేకుల ముస్లిం సమాజం ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్నదని జేఏసీ పేర్కొంది. పథకాల ప్రయోజనాలు అందకపోవడంతో సమాజంలోని అనేక కుటుంబాలు వెనుకబడుతున్నాయని తెలిపింది.
జూన్ 2026లో జగిత్యాల అసోసియేషన్ తరఫున దరఖాస్తు సమర్పించడంతో పాటు, జూన్ 27న సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు చేసినప్పటికీ స్పష్టమైన సమాచారం అందలేదని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఆర్టీఐ చట్టం ప్రకారం నిర్ణీత 30 రోజుల గడువు ముగిసినా సమాచారం అందలేదని పేర్కొన్నారు.
2010 జీవోను తక్షణమే అమలు చేయాలని, నూర్‌బాషా, దూదేకుల ముస్లింల కోసం ఫెడరేషన్ ఏర్పాటు చేసి అవసరమైన నిధులు, సిబ్బందిని కేటాయించాలని వారు కోరారు. అలాగే జీవో అమలుపై సమయపట్టికతో కూడిన స్థితిగతుల నివేదికను వెల్లడించాలని, ఆర్టీఐ దరఖాస్తుకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.
సీఎం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో దరఖాస్తును డా. జి. చిన్నారెడ్డి పరిశీలించారు. దరఖాస్తుదారుల అభ్యర్థన పాలసీ నిర్ణయానికి సంబంధించిన అంశమని పేర్కొంటూ, దీనిని సముచితంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవచ్చని సూచించారు. అనంతరం మైనారిటీ వెల్ఫేర్ శాఖ కార్యదర్శి, మైనారిటీ కమిషనర్, బీసీ వెల్ఫేర్ కమిషనర్లకు దరఖాస్తును పంపించారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మొహమ్మద్ రఫీ (ఎంబీఏ, ఎల్ఎల్బీ), వైస్ చైర్మన్ మొహమ్మద్ రాజమ్మద్, జనరల్ సెక్రటరీ మొహమ్మద్ సమ్దానీ (రిటైర్డ్ ఏఎస్ఐ), స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటరీ సాజిద్ అహ్మద్, జాయింట్ సెక్రటరీ షేర్ ఖాన్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మొహమ్మద్ చాంద్ పాషా, కోశాధికారి మొహమ్మద్ మొహమ్మద్, స్టేట్ లీగల్ అడ్వైజర్ మొహమ్మద్ సలీం, స్టేట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ సెక్రటరీ మొహమ్మద్ నసీర్, స్టేట్ మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్స్ సెక్రటరీ మహ్మద్ అజరుద్దీన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎం.డి. జాకీర్ పాషాతో పాటు జగిత్యాల జిల్లా జనరల్ సెక్రటరీ రాజ్ మహమ్మద్ అలీపూర్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రేచపల్లి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ షాజహాన్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.
