- హుజురాబాద్ నుంచి మల్కాజ్ గిరి కి ఎగిరిపోతున్న ఈటల
- రాజకీయ భవిష్యత్ నిచ్చిన హుజురాబాద్ ను ఇక మరిచినట్లేనా?
- ఇరవై సంవత్సరాల ప్రజాభిమానం గాలికి వదిలేసినట్లేనా!
- ఇప్పటికే హుజురాబాద్ లో జాడ కనపడని ఈటల రాజేందర్
- ఈటల ఆత్మగౌరవాన్ని కాపాడిన హుజురాబాద్ ప్రజలకు రాజన్న సమాధానం ఏంటో?
ఈటల రాజేందర్..ఈ పేరు బహుశా తెలంగాణ రాజకీయాల్లోనే కాదు..దేశంలోనూ ప్రజానీకానికి..రాజకీయ ఓనమాలు తెలిసిన అందరికీ తెలిసిన పేరు అని చెప్పొచ్చు. హుజురాబాద్ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు రాజకీయ యవనికపై స్థానం సుస్థిరం చేసుకున్న తెలివైన రాజకీయ నాయకుడిగా రాజకీయ వర్గాల్లో ఆయనకు పేరుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ‘నాడు’ ఉద్యమంలో, ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటు, ప్రభుత్వంలో, ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ కీలక భూమికను పోషించిన ధీశాలి ఈటల.
‘గులాబీ జెండా’కు ఓనర్లం అనే స్వరాన్ని సొంత పార్టీపైన వినిపించి..చివరకు కొన్ని ఆరోపణలతో పార్టీ నుంచి బయటకు వచ్చి..బీఆర్ఎస్ సర్ ‘ కారు ‘ కు వ్యతిరేకంగా కొట్లాడి..బరి గీసి నిలిచి..నిలబడి గెలిచిన వ్యక్తి ఈటల రాజేందర్. హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున గెలిచి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే పేరు సంపాదించారు. అయితే, ఆ తర్వాత జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈటల రాజేందర్ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ తాను ‘హుజురాబాద్’ ప్రాంతవాసులకు అండగా ఉంటానని పేర్కొన్నారు. కానీ, తాజా రాజకీయ పరిణామాలతో ఎంపీ బరిలో మల్కాజ్ గిరి నుంచి కమలం జెండా ఎగిరేసేందుకు వెళ్తున్న పరిస్థితులను చూస్తే..ఇక ఆయన తనకు హుజురాబాద్ తో ఉన్న‘పేగు బంధాన్ని’ చేజేతులారా తెంపేసుకున్నట్టేనన్న అభిప్రాయాలు సర్వత్రా,రాజకీయ వర్గాల్లో వెలువడుతున్నాయి.
ఇదే జరిగితే గత ఇరవై సంవత్సరాలుగా తన రాజకీయ భవిష్యత్తు కు పునాదులు వేసిన హుజురాబాద్ నియోజకవర్గానికి,నియోజకవర్గ ప్రజలకు ఈటల అన్యాయం చేసినట్లే…హుజురాబాద్ ఉప ఎన్నికలో కెసిఆర్ కి, కెసిఆర్ ప్రభుత్వానికి, ఈటల రాజేందర్ కి మధ్య జరిగిన సమరం లో హుజురాబాద్ ప్రజలు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో పథకాలు, పైసలను కాదని.. ఈటల వైపు ఉండి హుజురాబాద్ ప్రజల ఆత్మ గౌరవ బావుట ఎగురావేశారు. గత ఇరవై సంవత్సరాలు గా ఎన్ని ఎన్నికలు జరిగిన ఈటల రాజేందర్ మా బిడ్డ అని, మా అన్న అని హుజురాబాద్ ప్రజలు కడుపులోపెట్టి సాదుకున్నారు. కానీ, ఇన్ని సంవత్సరాలనుండి కాపాడుకున్న ప్రజలను ఒక్క ఎన్నికలో ఓడిపోవడంతో హుజురాబాద్ ప్రజల కడుపులో తన్ని పోతున్నాడని రాజకీయ మేధావుల అభిప్రాయం.
హుజురాబాద్ నియోజకవర్గం లో నడుస్తున్న బండి సంజయ్ “ప్రజా హిత” యాత్ర లో ఈటల రాజేందర్ పాల్గొనకపోవడం తో ఆయన హుజురాబాద్ కి ఇక రాడేమోనని అనుమానం కార్యకర్తల్లో నెలకొంది. ఈ యాత్ర లో బండి సంజయ్,ఈటల మధ్య అభిప్రాయ బేధాలు ఉండడంతోనే ఈటల రాలేదని స్థానిక ప్రజల అభిప్రాయంగా తెలుస్తోంది. తనను ఇన్నాళ్లు కడుపులో పెట్టుకొని చూసుకున్న హుజురాబాద్ ను వదిలి మల్కాజ్ గిరి కి ఈటల రాజేందర్ ఇక వలస వెళ్లినట్లే అనే అభిప్రాయం పలుచోట్ల వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో 20 ఏళ్ల పాటు ఈటల రాజేందర్ తో అనుబంధం పెన వేసుకున్న అనుచరులు, వర్గీయుల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారింది. ఇన్నాళ్లు తమకు అండగా ఉన్న ఈటల రాజేందర్ .. స్థాన బదిలీ కావడంతో ఈటల అనుచరుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే, మల్కాజిగిరి బరిలో నిలిచి గెలిస్తే.. అటు మల్కాజ్ గిరి ఇటు హుజురాబాద్.. రెండు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉంటూ బిజెపి తరఫున.. కేంద్రంలో చక్రం తిప్పే కీలక అవకాశాలు ఉండొచ్చు అనేది పలువురి అభిప్రాయం.
“సాదుకుంటరో.. సంపుకుంటరో” అంటూ హుజురాబాద్ ప్రజానీకపు ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్న ఈటల రాజేందర్ ఇక హుజురాబాద్ ప్రాంతంతో తనకు ఉన్న పేగు బంధాన్ని దాదాపుగా తెంచేసుకున్నట్లే నన్న అభిప్రాయాలు పలుచోట్ల సుస్పష్టంగా వ్యక్తం అవుతున్నాయి.
