- పట్టణాల అభివృద్ధికి భారీ నిధులు – ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, పట్టణాల అభివృద్ధిలో రాష్ట్రంలోనే టాప్ మున్సిపాలిటీలుగా నిలుస్తాయని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ధీమా వ్యక్తం చేశారు.
హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, పట్టణాల అభివృద్ధిలో రాష్ట్రంలోనే టాప్ మున్సిపాలిటీలుగా నిలుస్తాయని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ధీమా వ్యక్తం చేశారు.
మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, అలాగే జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్‌లో పట్టణ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాల అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీలుగా ఎదిగిన హుజురాబాద్, జమ్మికుంటల్లో గతంలో ఎదురైన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. ఎస్డిఎఫ్ నిధులతో పాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల నిధుల కేటాయింపులో హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు చోటు దక్కించుకోవడం హర్షణీయమని తెలిపారు. దీంతో రెండు మున్సిపాలిటీలకు కలిపి రూ.30 కోట్ల నిధులు అందనున్నాయని వెల్లడించారు.
ఈ నిధులతో పట్టణాల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని, దాని ప్రకారం అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. అలాగే హుజురాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులకు చెరొక రూ.15 లక్షల చొప్పున మొత్తం రూ.30 లక్షల నిధులు కేటాయించి పనులు వేగంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
ఆర్భాటమే తప్ప అభివృద్ధి లేదు: బీజేపీ, బీఆర్ఎస్‌పై విమర్శలు
పట్టణాల్లో పేరుకుపోయిన సమస్యలకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలే ప్రధాన కారణమని ప్రణవ్ విమర్శించారు. ఆర్భాటం తప్ప అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించడంలో ఆ పార్టీలు విఫలమయ్యాయని ఆరోపించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో సభా మర్యాదలు పాటించని నేతలు మున్సిపాలిటీల్లో ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారని ప్రశ్నించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయమే రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. వార్డుల అభివృద్ధితో పాటు రెండు మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి నిధుల వివరాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలను కోరారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
