అనపురం రమేశ్ గౌడ్ ఎంఏ.
ఆ పాదాలు బురదలో దిగితేనే
అన్నం మెతుకులు
లేకుంటే అన్నమో రామచంద్రా
ఆ చేతులు మట్టిని తాకితేనే
ఆకలి దూరం
లేకుంటే ఆగం బతుకులు
ఆ శరీరం వానలో తడుస్తనే
లోకానికి ఆశలు
లేకుంటే అడియాశలు
ఆ జీవి పోలంలోన సెమట చిందిస్తేనే
జనాలకు వెలుగులు
లేకుంటే చిమ్మ చీకట్లు
ఆ జీవి ఆరుగాలం శ్రమిస్తేనే
అందరికీ ఆనందం
లేకుంటే ఆకలి కేకలు
మరి ఆ జీవికి ఎన్ని ఇక్కట్లో
వాన చినుకుల కోసం ఎదురు చూపులు
పెట్టుబడి కోసం పడిగాపులు
అతివృష్టి అనావృష్టిల పోరాటం
విషపురుగులతో చెలగాటం
లోకం కోసం ఆరాటం
ఆఖరికి అల్లికల్లి సున్నకు సున్న
ఐనా మనసున్న మారాజు రైతన్న
నువ్వు లేకుంటే లోకమే చిన్న బోవన్న
జర కరుణించ రాదమ్మ వానమ్మా
ఎదురు సూడవట్టే నీకై నేలమ్మా.
