హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

  • ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల కరపత్రం ఆవిష్కరణ

కరీంనగర్/ధనాధన్ న్యూస్,జూన్ 23: రాష్ట్రంలోని అన్ని రంగాల హమాలి కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, జిల్లా అధ్యక్షుడు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం బొమ్మకల్ సిమెంట్ గోదాముల హమాలి కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని సిమెంట్ గోదాముల్లో పనిచేస్తున్న హమాలి కార్మికులకు పని భద్రత లేకుండా కంపెనీలు విధిస్తున్న ఆంక్షల కారణంగా ఉపాధి భద్రతకు ముప్పు ఏర్పడుతోందన్నారు.


తక్కువ కూలీకి ఇతర రాష్ట్రాల కార్మికులను నియమించడం వల్ల స్థానిక హమాలి కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్మిక శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందునే ఈ పరిస్థితులు నెలకొంటున్నాయని విమర్శించారు.హమాలి కార్మికులకు పని భద్రత కల్పించడంతో పాటు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, దాని ద్వారా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సిమెంట్ గోదాముల హమాలి కార్మికుల సమస్యలపై రానున్న ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల్లో ప్రత్యేక తీర్మానం చేయనున్నట్లు తెలిపారు.

సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.సెప్టెంబర్ 6, 7, 8 తేదీలలో జరగనున్న ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభలకు సిమెంట్ గోదాముల హమాలి కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, సిమెంట్ గోదాముల హమాలి కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జంగ తిరుపతి యాదవ్, బాగోతం వీరయ్య, పల్లెర్ల రాములు, నన్నవేని శ్రీనివాస్, నన్నవేని కొమురయ్య, జక్కుల ఐలయ్య, ముత్యాల శ్రీనివాస్, ఉప్పారపు శ్రీనివాస్, దానవేని కొమురయ్య తదితర హమాలి కార్మికులు పాల్గొన్నారు.

Leave a comment