డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

  • ఇల్లందకుంట ఎస్సై కాంత్రికుమార్

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్,జూన్ 24: డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇల్లందకుంట ఎస్సై కాంత్రికుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మండల కేంద్రంలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై కాంత్రికుమార్ మాట్లాడుతూ, డ్రగ్స్ వినియోగం వల్ల సమాజంలో ఏర్పడే దుష్పరిణామాలు, ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత సరదాగా ప్రారంభించే ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరించారు.


యువత దేశానికి పట్టుకొమ్మలని, వారు మంచి ఆలోచనలతో సమాజాభివృద్ధికి, దేశాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఒకసారి డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తిని ఆ వ్యసనం నుంచి బయటపడేయడం చాలా కష్టమని, మత్తు ప్రభావంలో వ్యక్తి తన ప్రవర్తనపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు.తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు లేదా విక్రయిస్తున్నట్లు అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment