- టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నబోయిన తిరుపతి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 24: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, వారికి రావాల్సిన పెండింగ్ బకాయిల చెల్లింపులో విఫలమైందని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నబోయిన తిరుపతి విమర్శించారు.బుధవారం జమ్మికుంటలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు డీఏలను విడుదల చేస్తామని, పీఆర్‌సీని ప్రకటించి ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటి వరకు ఆ హామీలను అమలు చేయలేదని అన్నారు.
పెండింగ్‌లో ఉన్న డీఏలను ప్రకటించి సంబంధిత జీవోలను వెంటనే విడుదల చేయాలని, అలాగే పీఆర్‌సీని ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పలుమార్లు ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా స్పందన లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
ఫెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలను సకాలంలో అందించకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో పలువురు ఫెన్షనర్లు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతకుముందు తెలంగాణ విద్యాశాఖ అదనపు డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, మాచినపల్లి గ్రామంలో ఆయనను కలిసి సంతాపం తెలిపారు. అనంతరం మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు శ్రీరామాంజనేయులు, కరీంనగర్ జిల్లా టీపీటీఎఫ్ ఉపాధ్యక్షుడు మర్రి అవినాష్, జిల్లా కార్యదర్శి కోడిగూటి తిరుపతి, జమ్మికుంట మండల అధ్యక్షుడు కొండపాక తిరుపతి, సీనియర్ నాయకులు రాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.