అంబేద్కర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి

  • రాజ్యాంగ విలువలను కాపాడుతూ బహుజన సమాజం ఐక్యంగా ముందుకు సాగాలి
  • ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణ కార్యక్రమం నిర్వహణ
  • ప్రజా గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు బత్తుల నరేష్

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 28: జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, డిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రజా గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు బత్తుల నరేష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బత్తుల నరేష్ మాట్లాడుతూ, అంబేద్కర్ పేరును కేవలం స్మరించుకోవడానికే పరిమితం కాకుండా ఆయన చూపిన మార్గాన్ని ఆచరణలో అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అణగారిన, వెనుకబడిన వర్గాలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక హక్కులు కల్పించేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాంతం పోరాటం చేశారని పేర్కొన్నారు.

భారత రాజ్యాంగం ద్వారా సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను దేశ ప్రజలకు అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి రక్షణ కవచమని, దానిని పరిరక్షించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని అన్నారు.అంబేద్కర్ ఆశయాల సాధనకు విద్యే ప్రధాన ఆయుధమని, యువత చదువుతో పాటు రాజ్యాంగంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. బహుజన సమాజం కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ఐక్యంగా నిలబడి సామాజిక మార్పు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా డిక్కీ జిల్లా కో-ఆర్డినేటర్ నల్ల శ్యామ్ మాట్లాడుతూ, భారతదేశంలో సామాజిక న్యాయానికి పునాది వేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. ఆయన చూపిన మార్గం నేటి తరానికి దిక్సూచిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సమాన హక్కులు, స్వాభిమానం, ఆత్మగౌరవం కోసం అంబేద్కర్ చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు.అంబేద్కర్ భావజాలాన్ని గ్రామాలు, పట్టణాల స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రతి ఆదివారం ఈ స్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ స్పూర్తిని ప్రతి ఇంటికి చేర్చడం, యువతలో సామాజిక బాధ్యత పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, మట్టిపూలు పత్రిక సంపాదకుడు తక్కళ్ళ దేవయ్య, దళిత క్రిస్టియన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ముద్దమల్ల ఆనంద్ ప్రవీణ్ కుమార్, సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ గొడిసెల అశోక్ రాజ్, భారతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చిత్తారి ప్రభాకర్, జిల్లా దళిత సంఘాల సీనియర్ నాయకుడు దుమాల గంగాధర్, సిరికొండ మాజీ సర్పంచ్ దాసరి లచ్చయ్య, రుద్ర మనోహర్, దాసండ్ల కమలాకర్, సంకె మహేష్, కిష్టంపేట మాజీ సర్పంచ్ జాన గోపి, లక్ష్మణ్, చిర్ర రవి, దేవి అంజి తదితర అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a comment