- ఇబ్రహీంపల్లిలో సర్వే నంబర్ 257లో అక్రమ నిర్మాణం ఆరోపణలు

కాటారం,జూన్ 30(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఇబ్రహీంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 257లో ప్రభుత్వ భూమిగా పేర్కొంటున్న స్థలంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమి అని తెలిసినా కొందరు వ్యక్తులు ఎలాంటి భయం లేకుండా ఇంటి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని వారు అంటున్నారు.
ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉన్నప్పటికీ, ఫిర్యాదులు వచ్చినా స్పందించడం లేదని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. దీంతో ప్రభుత్వ భూముల పరిరక్షణపై అధికారుల నిర్లక్ష్యం ప్రశ్నార్థకంగా మారిందని వారు అభిప్రాయపడుతున్నారు.
సదరు స్థలం ప్రభుత్వ భూమేనా? నిర్మాణానికి సంబంధిత అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు వెంటనే విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ భూమిపై అక్రమ నిర్మాణం జరిగినట్లు తేలితే, నిర్మాణాన్ని నిలిపివేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై సంబంధిత రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.