SIR ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలి: ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

మెట్‌పల్లి,జూన్ 30(ధనాధన్ న్యూస్: మెట్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన SIR (Special Intensive Revision) ప్రక్రియపై అవగాహన సదస్సుల్లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. సత్తక్కపల్లి, రాజేశ్వరరావుపేట, చెర్లకొండాపూర్, జగ్గాసాగర్, ఆత్మనగర్, రామలచక్కపేట గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, SIR ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పాల్గొని అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. బూత్ స్థాయి నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు సరైన అవగాహన కల్పించాలని కోరారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతులకు అవసరమైన సమయంలో యూరియా ఎరువు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రైతుబంధు వంటి పథకాల అమలులో కూడా రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.రైతుల సంక్షేమం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. అలాగే త్వరలో ప్రారంభం కానున్న బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి కార్యకర్త చురుకుగా పాల్గొని గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్‌ఏలు, బూత్ ఇన్‌చార్జ్‌లు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment