- ఇనుప రాడ్,రక్తపు మరకలున్న దుస్తులు,సెల్‌ఫోన్,బైక్ స్వాధీనం

జమ్మికుంట,జూన్ 29 (ధనాధన్ న్యూస్): మడిపెల్లి గ్రామంలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం మడిపెల్లి గ్రామానికి చెందిన గంగారపు మహేష్ (40)ను అదుపులోకి తీసుకుని విచారించగా, కేసుకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హుజురాబాద్ ఏసిపి మాధవి తెలిపిన వివరాల ప్రకారం,తన వ్యవసాయ భూమి సమీపంలో కౌలుకు వ్యవసాయం చేస్తున్న ఓ వివాహిత మహిళతో తనకు పరిచయం ఏర్పడిందని నిందితుడు విచారణలో తెలిపాడు. గతంలో ఆ మహిళకు సంబంధించిన ఓ కేసు నేపథ్యంలో మృతుడు పైతరి మొగిలితో తనకు విభేదాలు ఏర్పడ్డాయని, జైలు నుంచి విడుదలైన అనంతరం మృతుడు తనను తరచూ అవమానించడంతో పాటు దూషించేవాడని చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కారణాలతో కక్ష పెంచుకుని హత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
ఈ నెల 27న పీర్ల పండుగ సందర్భంగా గ్రామానికి వచ్చిన మృతుడిని గమనించిన నిందితుడు, ముందుగా యూట్యూబ్‌లో పలు అంశాలపై శోధనలు చేసిన అనంతరం ఇంటి నుంచి ఇనుప రాడ్ తీసుకుని గ్రామ శివారులో వేచి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అదే రోజు రాత్రి సుమారు 11.45 గంటలకు అంకుశాపూర్ రోడ్డుపై సైకిల్‌పై వెళ్తున్న మృతుడిపై వెనుక నుంచి ఇనుప రాడ్‌తో దాడి చేసి, అనంతరం పలుమార్లు కొట్టి హత్య చేసినట్లు విచారణలో నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన అనంతరం హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్‌ను వ్యవసాయ బావి సమీపంలో పడేసి, ఇంటికి వెళ్లి దుస్తులు మార్చుకున్నట్లు పేర్కొన్నారు.
నిందితుడు చూపిన ఆధారాల మేరకు పోలీసులు హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, రక్తపు మరకలున్న లుంగీ, నలుపు రంగు ఫుల్ హ్యాండ్స్ టీ-షర్ట్, యూట్యూబ్ శోధనలకు ఉపయోగించిన మోటరోలా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్, అలాగే ఘటనలో ఉపయోగించిన హీరో ప్యాషన్ ప్రో మోటార్ సైకిల్ (TS-02-FG-3054)ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.