- బాలిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రణవ్
- బాలిక మృతదేహాన్ని అడ్డుపెట్టుకొని శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటు
- కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడిన వోడితల ప్రణవ్
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో హుజురాబాద్ మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ వర్షిత అనే బాలిక ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని,దీనిపై ఇప్పటికే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారని, నివేదిక రాగానే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం నాడు ఆయన రాంపూర్ గ్రామానికి వెళ్ళి బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా బాలిక తల్లితండ్రులు తీవ్ర భాగోద్వానికి గురికాగా వారిని ప్రణవ్ ఓదార్చారు.అన్ని విధాల ఆదుకుంటామని అధైర్యపడొద్దని ధైర్యాన్నిచ్చారు.అనంతరం ఆయన మాట్లాడుతూ బాలిక మృతదేహాన్ని అడ్డుపెట్టుకొని కౌశిక్ రెడ్డి చేసిన ధర్నా చూస్తే సభ్య సమాజం తలదించుకునేలా ఉందని,పాప చనిపోయి పుట్టెడు దుఃఖంలో తల్లిదండ్రులు ఉంటే దీన్ని కౌశిక్ రెడ్డి అదునుగాతీసుకొని పోస్ట్ మార్టం అయిన తర్వాత బాలిక మృతదేహాన్ని అంబేద్కర్ చౌరస్తాలో పెట్టి ధర్నా చేయడం నీచమైన రాజకీయమని,అప్పుడు ఓట్ల కోసం సెంటిమెంట్ వాడుకున్నాడని,ఇప్పుడు శవరాజకీయాలను కౌశిక్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడని ఇది సిగ్గు చేటని అన్నారు.కౌశిక్ రెడ్డి లాంటి దౌర్భాగ్యపు ఎమ్మెల్యే ను దేశంలో ఇంతవరకు చూడలేదని అన్నారు.కౌశిక్ రెడ్డికి అంతలా సహాయం చేయాలి అనుకుంటే నేరుగా అధికారులతో మాట్లాడి సహాయం చేయాలి కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం మంచిదికాదని అన్నారు.
