- నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్
- గోరక్షకుడిని పరామర్శించిన ఈటల రాజేందర్
ధనాధన్ న్యూస్,అక్టోబర్,బుధవారం 22: ఘట్కేసర్ మండల పరిధిలో గోవులను తరలిస్తున్న వాహనాలను అడ్డుకోవడంతో చోటుచేసుకున్న కాల్పుల ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది. గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిని ఆపేందుకు ప్రయత్నించిన గోరక్షకులు ఎదుర్కొన్న దాడిలో సోను (ప్రశాంత్) అనే యువకుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం ఆయన యశోద ఆసుపత్రికి చేరుకుని గాయపడిన సోను ను పరామర్శించారు. బాధితుని కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యంపై మండిపడ్డారు.
“మన దేశంలో గోవు పూజ్యమూర్తి. గోమాతలను రక్షించడం సనాతన ధర్మంలోని భాగం. అలాంటి గోరక్షకులపై దాడులు జరగడం చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోవులను అక్రమంగా తరలించే గుంపులు, మాఫియా గ్యాంగులు మరింత ప్రోత్సాహం పొందుతున్నారు,” అని ఈటల అన్నారు.
ఆయన మరోసారి ఎంఐఎం నేతలపై విమర్శలు గుప్పించారు.
“ఇప్పటికే అనేకసార్లు ఎంఐఎం కార్యకర్తలు, వారి అనుచరులు గోరక్షకులపై దాడులు చేశారు. వాహనాలతో గుద్దడం, హింసాత్మక దాడులు చేయడం లాంటివి పునరావృతమవుతున్నాయి. తాజాగా ఓల్డ్ సిటీకి చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి ప్రశాంత్‌పై తుపాకీతో కాల్పులు జరిపి చంపే ప్రయత్నం చేయడం అత్యంత ఘోరం. ఇది ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి తారకరామం,” అని వ్యాఖ్యానించారు.
ఈటల రాజేందర్ ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బాధ్యత వహించాల్సిందే అని స్పష్టం చేశారు.
“గోరక్షకులను రక్షించలేకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు ఉంది? కాల్పులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి,” అని డిమాండ్ చేశారు. కోట్లాది మంది ప్రజల మనోభావాలు కాపాడాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులను శిక్షించాలి,” అని హెచ్చరించారు.
ఈటల రాజేందర్ సందర్శనతో యశోద ఆసుపత్రిలో ఆత్మీయ వాతావరణం నెలకొంది. గాయపడిన సోను కుటుంబ సభ్యులు ఈటల రాజేందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై బీజేపీ వర్గాలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. గోరక్షకులపై దాడులను అడ్డుకోవాలని, గోవులను అక్రమంగా తరలించే గుంపులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఘట్కేసర్ ఘటన గోరక్షణ అంశంపై రాష్ట్రంలో మరోసారి చర్చకు దారితీసింది. ప్రజలు, గోభక్తులు, రాజకీయ వర్గాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ న్యాయం కోసం స్వరమెత్తుతున్నారు.
