
హైదరాబాద్/ధనాధన్ న్యూస్: ప్రముఖ విద్యా సంస్థ LEAD నిర్వహించిన “శిక్ష అవార్డ్స్”లో మిలీనియం స్కూల్ మరో కీలక మైలురాయిని సాధించింది. సంస్థ రూపొందించిన కరికులం ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలను సమీక్షించి, ఆ కరికులాన్ని అత్యుత్తమంగా అమలు చేసిన విద్యాసంస్థలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ క్రమంలో మిలీనియం స్కూల్ జాతీయ స్థాయిలో విశిష్ట ప్రతిభ కనబరిచి “శిక్ష అవార్డు”ను అందుకుంది.
ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం హైదరాబాద్‌లోని నవోటెల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మిలీనియం స్కూల్ చైర్మన్ ముసిపట్ల తిరుపతి రెడ్డి అవార్డును స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విజయానికి స్కూల్ ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థుల సమిష్టి కృషి కారణమని పేర్కొన్నారు. వారి అంకితభావం, క్రమశిక్షణ, నాణ్యమైన బోధన విధానాల ఫలితంగానే ఈ గౌరవం దక్కిందన్నారు.
“మిలీనియం స్కూల్ ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక విద్యా విధానాలను అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. విద్యార్థులకు ఉత్తమమైన నేర్చుకునే వాతావరణాన్ని కల్పించడం మా ప్రధాన లక్ష్యం” అని ఆయన తెలిపారు.
విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ, ఆధునిక బోధన పద్ధతులను అనుసరిస్తున్న మిలీనియం స్కూల్‌కు ఈ అవార్డు మరో గుర్తింపుగా నిలిచింది.భవిష్యత్తులో కూడా విద్యా రంగంలో మరిన్ని విజయాలను సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని స్కూల్ యాజమాన్యం ఆకాంక్ష వ్యక్తం చేసింది.
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్స్ వరుణ్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.