- తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు
- కలెక్టరేట్ నుంచి డిపివో కార్యాలయానికి బదిలీ.. అక్కడి నుంచి ఎంపివోకు ఫైళ్ల తరలింపు

బుగ్గారం,జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 24:
జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌కు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ నుంచి నాలుగు ఆర్టీఐ కేసులకు సంబంధించి నోటీసులు జారీ అయినట్లు సీనియర్ ఆర్టీఐ కార్యకర్త, సామాజికవేత్త చుక్క గంగారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.ఈ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని జిల్లా కలెక్టరేట్ అధికారులను నోటీసుల్లో ఆదేశించినట్లు చెప్పారు.
అయితే, ఈ నోటీసులను జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా పంచాయతీ అధికారి (డిపివో) కార్యాలయానికి బదిలీ చేసి, సంబంధిత సమాచార అధికారులు బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపించారు. అనంతరం డిపివో కార్యాలయం నుంచి బుగ్గారం మండల పరిషత్ కార్యాలయానికి (ఎంపివో) కూడా ఈ నోటీసులను పంపినట్లు సమాచారం ఉందన్నారు.కానీ, ఈ నాలుగు కేసులకు సంబంధించిన సమాచారాన్ని జిల్లా కలెక్టరేట్ లేదా డిపివో కార్యాలయ అధికారులు మాత్రమే అందించాల్సి ఉందని ఫిర్యాదుదారుడైన చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.
ఇదే నాలుగు కేసులకు సంబంధించి గత మే 7న కూడా సమాచార కమిషన్ ఎదుట విచారణ జరగాల్సి ఉండగా, ఆ రోజు సంబంధిత అధికారులు ఎవరూ హాజరు కాలేదని తెలిపారు. ఈ వ్యవహారంపై అధికారులకు మెమోలు కూడా జారీ చేసినట్లు తెలిసిందన్నారు.
సమాచార హక్కు చట్టం–2005 అమలులో జిల్లా కలెక్టరేట్ స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో చట్టాల అమలు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని చుక్క గంగారెడ్డి విమర్శించారు. అధికారుల బాధ్యతారాహిత్య ధోరణిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు.